యాంకర్ అహ్మత్ కేసర్ (ఫైల్ ఫోటో)
ఇస్తాంబుల్ : ఓ టీవీ చర్చా వేదికలో రాజకీయ నేతలను ఉద్దేశించి యాంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సాధారణ పౌరుల ప్రాణాలు తీసే ముందు రాజకీయ నేతలను చంపాలి’ అని వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డాడు.
టర్కీ ప్రభుత్వ ఛానెల్ అకిట్ టీవీ యాంకర్ అహ్మత్ కేసర్ తాజాగా ఓ చర్చా కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ప్రధాన-ప్రతిపక్ష నేతలు కొందరు హాజరయ్యారు. ప్రస్తుతం సిరియా నెత్తురోడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర సిరియాపై ఉగ్రస్థావరాల మీద దాడుల కోసం టర్కీ సహకారం అందించటాన్ని నేతలంతా ముక్తకంఠంతో ఏకీభవించారు. అయితే కుర‍్షిద్ మిలిటెంట్లను మట్టుబెడుతున్నామన్న సాకుతో అక్కడి సాధారణ పౌరులను చంపటం సరికాదన్న కేసర్.. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
‘అంతలా చంపాల్సి వస్తే సాధారణ పౌరుల కంటే ముందుగా రాజకీయ నేతలను చంపాలి. ఇంత కన్నా దారుణమైన దేశద్రోహులు పార్లమెంట్‌లో కూర్చున్నారు. లౌకిక వాదం పేరుతో ఇస్లాం సాంప్రదాయలను తుంగలో తొక్కేస్తున్నారు. ముందు వాళ్లను చంపండి’’అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కేసర్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అతన్ని అరెస్ట్ చేసి దేశద్రోహిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అధికార పార్టీల నేతలు సైతం గొంతు కలపటం గమనార్హం. కేసర్‌పై ఫిర్యాదు అందటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరో వైపు అతన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. నేరం రుజువైతే టర్కీ చట్టాల ప్రకారం అతనికి మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఇదిలా ఉంటే టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. గత వారం తూర్పు ఖరామాన్మరస్ ప్రాంతంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వేదిక మీదకు ఓ ఆరేళ్ల బాలికను పిలిచారు.
మిలిటరీ దుస్తుల్లో ఉన్న ఆ పాపను ‘దేశం కోసం నువ్వు చనిపోతే.. జెండా కప్పి నీకు అమర జీవి బిరుదు ఇస్తాం. అందుకు నువ్వు సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. అయితే రెసెప్ గద్దించటంతో ఆ పాప ఏడుస్తూ అవునని బదులిచ్చింది. చిన్న పిల్లతో అలాంటి ప్రమాణం చేయించిన అధ్యక్షుల వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment