ఆగ్నేయాసియాను అతలాకుతలం చేస్తున్న సిరియా యుద్ధం ఎట్టకేలకు శాంతి తీరాన్ని చేరనున్నదనిపించే సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం అమెరికా, రష్యాల మధ్య కుదిరిన సిరియా తాత్కాలిక శాంతి ఒప్పందం ఫలితంగా ఈ నెల 27 నుంచి సిరియా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ల టెలిఫోన్ సంభాషణ తదుపరి వెలువడటం వల్ల ఈ ప్రకటన ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరాన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌లు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మిగతా విష యాలెలా ఉన్నా అతి పెద్ద అంతర్జాతీయ మానవతావాద సవాలుగా మారిన నిస్సహాయులైన సిరియా ప్రజలకు సహాయం అందించే అవకాశం ఏర్పడుతుంది. ఆహ్వానించదగిన ఈ పరిణామంపై అనుమానాల నీలి నీడలూ కమ్ముకుంటున్నాయి. ఈ కాల్పుల విరమణ పాక్షికమైనది కావడమూ అందుకు ఒక కారణం.
ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తున్న ఐఎస్‌ఐఎస్‌కు, జబాత్ అల్ నస్రా లేదా నస్రా ఫ్రంట్‌కు ఈ కాల్పుల విరమణ వర్తించదు. పైగా ఇటు ప్రభుత్వ బలగాలకు, అటు తిరుగుబాటుదార్లకు కూడా ఆత్మరక్షణ కోసం సమాన స్థాయి ప్రతిస్పందన హక్కు ఉంటుంది. మధ్యేవాద తిరుగుబాటుదార్లుగా పిలుస్తున్న సున్నీ ఇస్లామిక్ గ్రూపులు, ఉగ్రవాదులుగా గుర్తిస్తున్న నస్రా ఫ్రంట్ పనిచేసే ప్రాంతాలు కలగలిసి ఉండటం వల్ల కాల్పుల విరమణ ప్రాంతాలను నిర్వచించడమే కష్టమౌతుంది. అసలు ఎవరు ఉగ్రవాదులనే విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. అమెరికా, నాటోలు ‘మధ్యేవాద గ్రూపులు’గా పేర్కొంటున్నవన్నీ నస్రా ఫ్రంట్‌తో సంబంధా లున్నవేనని పాశ్చాత్య మీడియా సైతం పేర్కొంటోంది. ఈ నెల 19 నుంచి అమ ల్లోకి రావాల్సి ఉన్న మ్యూనిచ్ కాల్పుల విరమణ ఒప్పందానికి పురిట్లోనే సంధి కొట్టింది. కాల్పుల విరమణకు ఉన్న వారం గడువులోగా తిరుగుబాటుదార్లపై రష్యా వైమానిక దాడులను ముమ్మరం చేయడంతో అసద్ సేనలు నిర్ణయాత్మక విజయాలను సాధించి, వారిని పూర్తి రక్షణ స్థితిలోకి నెట్టేశాయి. ఆ దాడులలో పౌర నివా సాలు, ఆసుపత్రులపై బాంబులు కురిపించి రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఇప్పటికే సిరియాలోని ఐఎస్‌ఐఎస్ ప్రధాన ప్రాబల్య ప్రాంతమైన అలెప్పోను చుట్టుముట్టి పట్టుబిగిస్తున్న అసద్ సేనలు 27 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేలోగా అక్కడి ప్రతిఘటనను పూర్తిగా నిర్మూ లించేలా రష్యా వైమానిక దాడులను ఉధృతం చేస్తుందనే వాదన సహేతుకమే. ఆ లక్ష్యం నెరవేరకపోతే ఈ నెల 12న కుదిరిన మ్యూనిచ్ ఒప్పందంలాగే తాజా ఒప్పందాన్ని కూడా అమల్లోకి రానివ్వకపోవచ్చనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఐఎస్‌ఐఎస్ 2014లో వలే బలీయమైన శక్తిగా లేదు. గత ఏడాది మే నుంచి అది సాధించిన చెప్పుకోదగిన విజయాలు లేవు. ఇటు సిరియా, అటు ఇరాక్‌లలో అది కుర్దుల చేతుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. ఇరాక్‌లోని మొసుల్, సిరియాలోని ‘రాజధాని’ రఖాలను కూడా అది త్వరలోనే కోల్పోతుందని భావి స్తున్నారు. అందువల్లనే అసద్‌ను గద్దె దించడమా? లేక కొనసాగించనీయడమా? అనేదే ఇప్పుడు కీలకమైనదిగా మారింది. అమెరికా చొరవతో జరుగుతున్న ఈ శాంతి ప్రయత్నాలకు అసద్ ప్రభుత్వమేగాక, రష్యా సైతం సుముఖంగా లేదనే వాదన వినవస్తోంది. రష్యా వైమానిక దాడుల అండతో అసద్ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదార్లను కొన్ని చిన్న ప్రాంతాలకు పరిమితం చేశాయి.
మరికొన్ని వారాల్లోనే తిరుగుబాటుదార్లను తుడిచి పెట్టేసే అవకాశం ఉన్న ఈ దశలో కాల్పుల విరమణ కంటే కాలయాపనే ఉత్తమమని అవి భావిస్తాయనే వాదనను కొటి ్టపారేయలేం. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సిరియాలో ఐఎస్‌ఐఎస్‌పై వైమానిక దాడులను ప్రారంభించిన రష్యా నవంబర్లో చిన్నదే అయినా బలమైన సైనిక బలగాన్ని పంపి టర్కీ సరిహద్దులకు సమీపంలోని సిరియా వైమానిక స్థావరం లతికియాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి సిరియా కేంద్రంగా మధ్య ప్రాచ్యంలోని బలాబలాల్లో మార్పు వచ్చింది. రష్యా తన వైమానిక బలగాల్లోని అత్యాధునికమైన ఎస్‌యూ-35 యుద్ధ విమానాలను, ఎస్-400 క్షిపణి వ్యవస్థలను లతికియాలో మోహరించి ఆగ్నేయాసియాలో అమెరికాతోపాటూ మరో ఆధిపత్య శక్తిగా గుర్తింపును పొందాలని తాపత్రయపడుతోంది.
ఒక శాంతి ఒప్పందాన్ని కాలరాచిన వెంటనే మరో ఒప్పందం కోసం సిద్ధమైన అమెరికా వైఖరిని బట్టి చూస్తే ‘ఏది ఏమైనా అసద్ గద్దె దిగాల్సిందే’ అనే తన వైఖరి నుంచి దూరంగా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే రష్యా, ఇరాన్‌లను విజేతలుగా అంగీకరించి, అది ఇరాక్ తదితర ప్రాంతాల్లోని ఐఎస్‌ఐఎస్ వ్యతిరేక యుద్ధానికి పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకు అది సిద్ధపడు తుందా? లేక కనీసం నూతన అధ్యక్షుని రాకవరకు తాత్కాలిక శాంతితో కాల యాపన చేయాలనుకుంటుందా? అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఒక వేళ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చినా అసద్‌ను గద్దె దించడం కోసం 2011 నుంచి అమెరికా ప్రోద్బలంతో సాగుతున్న తిరుగుబాటులో కీలక పాత్రధారులుగా ఉన్న సౌదీ అరేబియా, ఖతార్ తదితర జీసీసీ దేశాలు, నాటో దేశమైన టర్కీ ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే విషయంలో అనిశ్చితి ఉంది. అసద్ బలగాలు తిరుగుబాటుదార్లపై పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్న ఈ దశలో తాత్కాలిక శాంతి, అసద్ ప్రభుత్వం సంఘటితం కావడానికి తోడ్పడుతుందని అవి ఇప్పటికే అమెరికా శాంతి ప్రయత్నాలపట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఈ నెల 15న టర్కీ, సిరియాలోకి సేనలను పంపి భూతల యుద్ధం సాగిస్తామంటూ ఉద్రిక్తతలను తారస్థాయికి చేర్చింది.
అప్పటికే సిరియాలో తన అమెరికన్ తయారీ ఎఫ్-15 యుద్ధ విమానాలను మోహరించిన సౌదీ కూడా ఖతార్ తదితర మిత్ర దేశాల సేనలతో సిరియాలో భూతల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించి ప్రచ్ఛన్న యుద్ధ కాలపు రోజులు పునరావృతమవుతున్నాయనే ఆందోళనను రేకెత్తించింది. అందుకు అమెరికా కనీసం ఇప్పుడు సిద్ధంగా లేదనడానికి దాని శాంతి ప్రయత్నాలే నిదర్శనమని భావించవచ్చనుకోవడం సహేతుకమే. టర్కీ, సౌదీలు ఎలాంటి దుస్సాహసానికి దిగకపోతే, రష్యా ఈ ఒప్పందానికి కట్టుబడితే తాత్కాలికంగానైనా నెలకొనే శాంతి సిరియా ప్రజలకు గొప్ప ఊరట కాగలుగుతుంది.
శాంతి తీరానికి సిరియా?
Published Tue, Feb 23 2016 11:57 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement