దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: మన్మోహన్‌సింగ్
ఆర్థిక పరిస్థితిపై ప్రధాని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అంతర్గత అంశాలతో పాటు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశం ప్రస్తుతం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. సిరియాలో ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ అంశాలు సృష్టించిన అస్థిర పరిస్థితులను అంచనా వేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రూపాయి రోజు రోజుకూ పతనమవుతున్న పరిస్థితిపై గురువారం పార్లమెంటులో తీవ్ర గందరగోళం చెలరేగింది.
రూపాయి పతనం దేశంలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోందని.. ఈ పతనం ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియటం లేదని, దీనిని నిలువరించటానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. లోక్‌సభలో వామపక్ష పార్టీలు, ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయటంతో పలుమార్లు వాయిదాపడింది. దీనిపై ప్రధానమంత్రి తక్షణం ప్రకటన చేయాలని విపక్షం డిమాండ్ చేసింది. రాజ్యసభలోనూ ఈ అంశం గందరగోళానికి దారితీసింది. అస్థిర పరిణామాలు, ప్రభావాలపై అంచనా వేసి శుక్రవారం ప్రకటన చేస్తానని మన్మోహన్ తెలిపారు.
‘పీహెచ్‌డీ’లు ఉన్నా ఉపయోగమేంటి?
లోక్‌సభ సమావేశం కాగానే ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్.. రూపాయి పతనంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ మీరాకుమార్‌ను కోరారు. ‘‘ఆర్థిక పరిస్థితిపై మొన్న సభలో చర్చ జరిగింది. ఆర్థికమంత్రి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. పది చర్యలు వివరించారు. వాటిని అమలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. కానీ.. వాస్తవానికి పరిస్థితి దిగజారింది’’ అని తూర్పారబట్టారు. ఆర్థికమంత్రిగా పనిచేసిన, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కారణమని తప్పుపట్టేందుకు చిదంబరం పరోక్షంగా ప్రయత్నించారని సుష్మా ఆరోపించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీలు (డాక్టరేట్ డిగ్రీలు) ఉన్న వారు.. ఆర్థికవ్యవస్థను నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రూపాయి పతనం ఆగిపోతుందా, దిగజారటం కొనసాగుతుందా అనేదానిపై ప్రధానమంత్రి స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు.