సిరియాలో ‘సత్యం వధ’! | Attack over truth in Syria | Sakshi
Sakshi News home page

సిరియాలో ‘సత్యం వధ’!

Published Thu, Sep 5 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

సిరియాలో ‘సత్యం వధ’!

సిరియాలో ‘సత్యం వధ’!

యుద్ధంలో మొట్టమొదట హతమయ్యేది నిజమేనని పదేపదే రుజువవుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా సిరియాపై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలలో నిజం నిత్య మరణాన్ని చనిచూస్తోంది. గత నెల 21 అర్థరాత్రి సిరియా రాజధానిలో జరిగిన రసాయనిక ఆయుధ ప్రయోగం అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సేనల పనేనని అనడానికి ఉన్న తిరుగులేని ‘ఇంటెలిజెన్స్ ఆధారాలను’ సోమవారం కాంగ్రెస్ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో బరాక్ ఒబామా ప్రభుత్వం ప్రదర్శించింది. ఆ ఆధారాలు ‘యూట్యూబ్’ ఆధారిత నిఘా సమాచారం కావడం విశేషం. ఆ ఆధారాలకు ఆధారం ఇజ్రాయెల్ రక్షణ బల గాల 8,200వ యూనిట్ అందించిన సమాచారమేనని ‘ఫాక్స్ న్యూస్’ సైతం చెబుతోంది. అసత్య ప్రచారం ఎవరైనా చేయగలరు, అసత్యాలను తిరుగులేని ‘సత్యాలు’గా చలామణి చేసే విద్యలో ఇజ్రాయెల్ అమెరికా కంటే  రెండాకులు ఎక్కువే చదివింది.
 
 సిరియాపై యుద్ధం కోసం రెండేళ్లుగా అమెరికా చెవిని ఇల్లు కట్టుకొని పోరుతున్న ఇజ్రాయెల్ చేతికే అలాంటి ‘సమాచారం’ లభించడంలో ఆశ్చర్యం లేదు.  సోమవారం నాటి సమావేశానికి హాజ రైన కాంగ్రెస్ సభ్యులు ‘ఆధారాల’ విశ్వసనీయతపైగాక, యుద్ధంలోని చిక్కులను గురించే చర్చించారు, విభేధించారు, చివరికి డెమోక్రాట్లు, రిపబ్లికన్లన్న తేడా లేకుండా అంతా ఒక్కటయ్యారు. దీంతో సిరియాపై సైనిక చర్యకు సెనేట్ మంగళవారం పచ్చజెండా చూపింది. వియత్నాం నుంచి ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల వరకు పార్టీలకతీతకంగా కాంగ్రెస్ ప్రభుత్వ ‘ఆధారాలను’ పరమ సత్యాలుగా న మ్ముతూనే ఉంది, ఆమోదముద్ర వేస్తూనే ఉంది. కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసం రికార్డు స్థాయిలో 25 శాతం కంటే తక్కువగా ఉంది. పైగా అసద్ రసాయనిక ఆయుధ ప్రయోగం నిజమే అయినా సైనిక జోక్యం వద్దని అత్యధిక ప్రజలు ఘోషిస్తున్నారు. అలాంటి ‘అల్పమైన’ విషయాలకు ప్రపంచంలోని అతి గొప్ప ప్రజాస్వామ్యంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు.  
 ఈ తిరుగులేని ఆధారాల కట్టుకథను ‘అసోసియేటెడ్ ప్రెస్’ కరెస్పాండెంట్ డాల్ గల్వాక్ గత నెల చివర్లో బట్టబయలు చేశారు: ‘సౌదీ గూఢచారి సంస్థ అధిపతి ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ ద్వారా కొందరు తిరుగుబాటుదార్లకు రసాయనిక ఆయుధాలు అందాయి.
 
 వారే డమాస్కస్ రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడ్డారు’. కాబట్టి అమెరికాకు ఇజ్రాయెల్ ద్వారా అందిన ‘ఆధారాలు’ మేడ్ ఇన్ సౌదీ అరేబియా అసత్యాలు! తిరుగుబాటుదార్ల నుంచే అందిన విశ్వసనీయ సమాచారంగా గల్వాక్ తెలిపిన ఆ కథనాన్ని ధృవపరిచే ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి. రసాయనిక ఆయుధ ప్రయోగం తిరుగుబాటుదార్ల పనేనని గౌటా ప్రాంత వాసులు బహిరంగంగానే చెబుతున్నట్టు గల్వాక్‌తో పాటూ ఇతర పాత్రికేయులు కూడా వెల్లడించారు. ఇటు అసద్ సేనల చేతిలోనూ అటూ తిరుగుబాటదార్ల చేతుల్లోనూ కూడా హతమవుతున్న సిరియన్ కుర్దులు సైతం అదే మాట అంటున్నారు. ‘ఇది అసద్‌ను ఇరికించడానికి తిరుగుబాటుదార్లు చేసిన పనే. ఐక్యరాజ్య సమితి నిపుణులు అతడే బాధ్యుడని గుర్తిస్తారనడంలో సందేహం లేదు’ అని కుర్దిష్ డెమోక్రటిక్ యూనియన్ (పీవైడీ) అధినేత సలే ముస్లిం ఆగస్టు 27నే స్పష్టం చేశారు. ఇరాక్ యుద్ధంలో జార్జి డబ్ల్యూ బుష్ అబద్ధానికి భిన్నంగా అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘నిజమైన అబద్ధాన్ని’ సృష్టించారు.
 
 ‘మానవతావాద యుద్ధం’   
 రసాయనిక ఆయుధ ప్రయోగానికి కనీసం 2,500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నమాట నిజమే. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రసాయనిక ఆయుధాల తయారీకి నాంది పలికి, ప్రయోగించడంలో అగ్రగామిగా నిలిచిన ఘనత అమెరికాదే. 1947లోనే నాటి అధ్యక్షుడు హెన్రీ ట్రూమెన్ రసాయనిక, జీవ ఆయుధాల నిషేధంపై జెనీవా ఒప్పందానికి మోకాలడ్డారు. 1950 కొరియా యుద్ధంలో అమెరికా జీవ ఆయుధ ప్రయోగంతో శాన్‌ఫ్రాన్సిస్కో వ్యాధి కారక బాక్టీరియాను ప్రయోగించింది. అది మొదలు  పదే పదే అది రసాయనిక, జీవ ఆయుధాల ప్రయోగానికి పాల్పడుతూనే వచ్చింది. వియత్నాం యుద్ధంలో అది నిషిద్ధ నాఫాం బాంబులతో మూడు లక్షల మందిని బలిగొనడమేగాక, రసాయనిక ఆయుధాలతో 60 లక్షల మందికి తిండిపెట్టే పచ్చని పొలాలను ఎడారిగా మార్చింది. ఎట్టకేలకు 1974లో జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసినా భారీగా వాటిని నిల్వచేసి, రహస్యంగా మిత్రులకు అందిస్తూ వచ్చింది. 1984లో ఇరాక్-ఇరాన్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ రసాయనిక ఆయుధాలతో లక్షమంది ఇరానీయులను హతమార్చాడు. ఆ యుద్ధంలో అమెరికా సద్దాం కొమ్ముకాసింది! సద్దాం 1988లో కుర్దు తిరుగుబాటుదార్లపై రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడి 5,000 మందిని హతమార్చాడు. 1991లో సీనియర్ బుష్ సద్దాంపై ‘దుష్ట నియంత’ ముద్ర వేసేవరకు అమెరికా పాలకులకు ఎన్నడూ రసాయనిక ఆయుధ ప్రయోగం అభ్యంతరం కాలేదు. సిరియా వద్ద ఉన్నాయో లేవో కూడా ఇదమిత్థంగా తెలియని రసాయనిక ఆయుధాల పట్ల ఒబామా ఆందోళనకు కూడా ఆ ‘మానవతావాదమే’ కారణం.  
 
 సిరియాలోకి సైన్యాన్ని దించకుండానే అసద్ రసాయనిక ఆయుధాల గుట్టను నిర్వీర్యం చేస్తామని అమెరికా అంటున్నది. అసద్ వద్ద ఉన్నాయంటున్న 1,000 టన్నుల రసాయనిక ఆయుధాలు 50 పట్టణాలలో, భూగర్భ బంకర్లలో ఉన్నాయని ‘సమాచారం’. వాటిపై బాంబుల వర్షం కురిపిస్తే శారీన్, మస్టర్డ్ గ్యాస్‌లు వాతావరణంలోకి విడుదలై కలిగే జననష్టం ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రసాయనిక ఆయుధాలను నిర్వీర్యం చేయగలవని చెబుతున్న ‘ఏజెంట్ డిఫీట్ ఆయుధాలు’ సృష్టించే ఉష్ణోగ్రతలు 1,200 డిగ్రీల నుంచి 1,500 డి గ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి. అంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతలకు కూడా రసాయనిక ఆయుధాలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయన్న హామీ లేదు. కానీ ఆ వేడికి సమీప ప్రాంతాలన్నీ సకల వస్తు, జీవరాశితో సహా బుగ్గికావడం మాత్రం ఖాయం. సిరియా రసాయనిక ఆయుధ ప్రయోగం ఎర్ర గీతను దాటినందుకే ఈ యుద్ధం అంటున్న ఒబామా వాదన తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్నట్టుగా లేదూ?
 
 ‘ప్రజాస్వామ్య’ దురాక్రమణ
 డమాస్కస్ రసాయనిక ‘చేతబడి’తో సిరియా యుద్ధానికి నాంది పలికిన ఒబామా తనకు తానే కాంగ్రెస్ అనుమతి ప్రహసనానికి తెరలేపి పరిశీలకులను విస్మయంలో ముంచారు. 1983లో అధ్యక్షునికి దఖలుపడ్డ విశేష అధికారాలతోనే ఆయనకు ముందటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ కాంగ్రెస్ అనుమతి కోరకుండానే 2003లో ఇరాక్‌పై దురాక్రమణకు దిగారు. అలాగే ఒబామా కూడా కాంగ్రెస్ ఔన న్నా, కాదన్నా సైనిక చర్యకు దిగవచ్చు. ఆ విషయాన్ని విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సోమవారం స్పష్టం చేశారు.  సిరియాపై సైనిక చర్యకు ఆమోదం తెలిపిన సెనేట్... సైనిక చర్య 60 రోజులకు మించరాదని, అమెరికా బలగాలను సిరియా భూభాగంపై యుద్ధంలోకి దించరాదని ఆంక్షలను విధించింది. ఆ ఆంక్షలను లెక్కచేయాల్సిన అవసరం కూడా అధ్యక్షునికి లేదు. అది కూడా కెర్రీయే మంగళవారం తెలిపారు. అవసరమైతే సిరియాలోకి సైన్యాన్ని దించే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు. అమెరికా బాటలోనే కదన కుతూహలంతో ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్‌లు కూడా పార్లమెంటు ఆమోదాన్ని కోరాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పార్లమెంటు ఆమోదం పొందడంలో విఫలమై భంగపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె ఇంకా పార్లమెంటు ముందుకు వెళ్లలేదు. కనీసం నెలరోజుల ముందే యుద్ధానికి సిద్ధమైన ‘ముగ్గురు మిత్రులు’ కోరి తాత్సారం చేసి ‘ప్రజాస్వామ్య’ గండాన్ని ఎందుకు కొనితెచ్చుకున్నట్టు? సమాధానం ‘బందర్ బుష్’ చెప్పాల్సిందే.
 
 పుతిన్ మెడపై ‘బందర్ బుష్’ కత్తి
 సిరియా యుద్ధంలో కీలక పాత్రధారిగా మారిన బందర్ బిన్ సుల్తాన్ ‘బందర్ బుష్’గానే సుప్రసిద్ధులు. ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల ‘హీరో’ జూనియర్ బుష్ తండ్రి సీని యర్ బుష్ కాలం నుంచి ఆయన అమెరికా దురాక్రమణ యుద్ధాలన్నిటిలోనూ కీలక పాత్రధారి. గతనెల మొదటివారంలో బందర్ రష్యాకు వెళ్లి అధ్యక్షుడు వ్లదిమిర్ పుతి న్‌తో సుదీర్ఘ రహస్య సమాలోచ నలు సాగించారు. ఆ  సమావేశ వివరాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ‘‘ఇజ్రాయెల్ నుంచి సైప్రస్ వరకు ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతంలోని చమురు, వాయు నిక్షేపాల విషయంలో రష్యా ప్రయోజనాలు మాకు బాగా తెలుసు. అలాగే యూరప్‌కు రష్యా గ్యాస్ పైపులైను ప్రాధాన్యం కూడా తెలుసు. ఆ విషయంలో మీతో పోటీ పడే ఆసక్తి మాకు లేదు. ఆ ప్రాం తంలో మనం సహకారం నెలకొల్పుకోవచ్చు’’ అంటూ బందర్ బుష్ పుతిన్‌కు స్పష్టం చేశారు. సౌదీతో సహకారానికి సిద్ధమైతే చమురు ధరలు, ఉత్పత్తుల పరిమాణంపై కలిసి గుత్తాధిపత్యం నెరపవచ్చని ఊరించారు. చమురు ఎగుమతి దేశాల ఒపెక్‌కూ, రష్యా నేతృత్వంలోని గ్యాస్ ఎగుమతి దేశాల వేదికకూ (జీయీసీఎఫ్) మధ్యన ఈ ఒప్పందం కోసం పుతిన్ సిరియాను త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధపడకపోతే... వచ్చే ఏడాది రష్యాలో జరగనున్న చలికాలపు ఒలింపిక్స్‌పై చెచెన్ ఉగ్రవాద దాడులు తప్పవని బందర్ స్పష్టం చేశారు. చెచెన్ ఉగ్రవాదులతో సౌదీకి ఉన్న అనుబంధాన్ని బందర్ గుర్తుచేశారు.
 
 బందర్ బ్లాక్‌మెయిల్ దౌత్యం ఫలితాల కోసం అమెరికా ఎదురుచూస్తోంది. గురు, శుక్రవారాల్లో రష్యాలో జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్, ఒబామాల మధ్య నేరుగా చర్చలు జరగను న్నాయి. అప్పుడే పుతిన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ కీలక సమయంలో చైనా మౌనం అటు పుతిన్‌కు ఇటు ఒబామాకు కూడా అంతు పట్టడం లేదు. బందర్ దౌత్యం విఫలమైనా యుద్ధం తప్పకపోవచ్చు. సఫలమైతే మాత్రం సౌదీ, రష్యాలు ఇవ్వనున్న చమురు షాక్‌కు ప్రపంచం సిధ్ధంగా ఉండాల్సి వస్తుంది. అసద్ ‘పరిమిత యుద్ధం’తో కుప్ప కూలవచ్చు. ఏదిఏమైనా ఈ సంక్షోభానికి మూలం చమురు నిక్షేపాల వేటేననడంలో సందేహంలేదు. ఆమాట నేటి అమెరికా రక్షణమంత్రి చుక్ హ్యాగెల్ 2007లోనే చెప్పారు: ‘మనం చేసే యుద్ధాలు చమురు కోసం కావని అంటుంటారు. కానీ అదే నిజం.’    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement