మాస్కో: తిరుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబంతో సహా పారిపోయి.. మిత్రదేశం రష్యాను ఆశ్రయించాడు మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్. అయితే.. అక్కడా ఆశ్రయంలోనూ ఆయన స్థిమితంగా ఉండలేకుండా పోతున్నారని సమాచారం. ఈ క్రమంలో భార్య అస్మా రూపంలో ఆయన పెద్ద షాకే తగిలింది.
తాజాగా.. బషర్ భార్య అస్మా ఆయన నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వరుస పరిణామాలు.. పైగా రష్యాలో ఆశ్రయం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో తన స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. రష్యాలో వాతావరణం తనకు ఏమాత్రం నచ్చలేదని.. తాను దేశం దాటేందుకు అనుమతివ్వాలని.. ఈ క్రమంలోనే తనకు విడాకులు మంజూరు చేయాలని.. రష్యా కోర్టులో ఆమె ఓ పిటిషన్ వేశారు. దేశం విడిచేందుకు తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు.
మరోవైపు.. రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ బషర్‌కు ఉపశనం కలిగే అవకాశం లేదు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండేలా ఆయనపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రష్యా విడిచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ అస్మా తన పిల్లలతో మాస్కో వీడేందుకే సిద్ధమైనట్లు టర్కీ,అరబ్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.
అస్మా.. బ్రిటిష్-సిరియా సంతతికి చెందిన వ్యక్తి. లండన్‌లో జన్మించిన అస్మాకు 2000లో అసద్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె సిరియాలో అడుగుపెట్టింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు.
సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్ కుటుంబ పాలన గుప్పిట ఉంది. 1971 నుంచి చనిపోయేంత వరకు బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను పాలించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అయిష్టంగానే డెంటల్ డాక్టర్ అయిన బషర్ అల్ అసద్ అధ్యక్ష పీఠం ఎక్కారు. అయితే అధికారంలోకి రాగానే నియంత పోకడలను కొనసాగించాడు బషర్. దీంతో ఆయన్ని గద్దె దింపేందుకు 20 ఏళ్లుగా పోరాటాలు సాగాయి. ఈ క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో 5 లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే.. బషర్ విముక్త సిరియా కోసం పోరాడిన తిరుగుబాటుదారులు.. ఎట్టకేలకు ఈ నెల ప్రారంభంలో రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. దీంతో ప్రాణభయంతో బషర్ కుటుంబ సభ్యులతో సహా రష్యాకు పారిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment