హమాను హస్తగతం చేసుకున్న సిరియా తిరుగుబాటుదారులు
బషర్ అసద్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
బీరూట్: బషర్ అల్ అస్సాద్ సారథ్యంలోని సిరియా ప్రభుత్వం మరో వైఫల్యాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వ సేనలతో మూడు రోజుల తరబడి పోరాడిన సిరియా తిరుగుబాటుదారులు ఎట్టకేలకు హమా నగరాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో విస్తీర్ణంపరంగా దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన హమా ఇప్పుడు తిరుగుబాటుదారుల వశమైంది.
హమా నగరంలోని పోలీసు కమాండ్ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం, కేంద్ర కారాగారంపై తిరుగుబాటుదారులు పట్టుసాధించారు. జైళ్లో ఉన్న వందల మంది తోటి తిరుగుబాటుదారులు, ఖైదీలను బయటకు వదిలేశారు. తిరుగుబాటుదారులు నగరం మధ్యలోకి వచ్చేయడంతో ఘర్షణలతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇష్టంలేక తాము నగరాన్ని వదిలేసి వచి్చనట్లు సైన్యం గురువారం ప్రకటించింది.
దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ సిటీపై ఇప్పుడు తిరుగుబాటుదారులు గురిపెట్టారు. ఆక్రమించిన హమాకు ఈ నగరం కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘‘దేశ రాజధాని డమాస్కస్‌కు సింహద్వారంగా హోమ్స్ సిటీకి పేరుంది. డమాస్కస్ నుంచి పాలన సాగిస్తున్న అస్సాద్‌కు ఇది మింగుడుపడని వ్యవహారమే. ఎందుకంటే హమాపై పట్టు కోల్పోయారంటే అస్సాద్ త్వరలో దేశంపైనా పట్టుకోల్పోతారని అర్థం’’అని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంస్థ ‘వార్ మానిటర్’చీఫ్ రమీ అబ్దుర్రహమాన్ వ్యాఖ్యానించారు.
‘‘మేం హమాను గెలిచాం’’అని బుధవారం అలెప్పో సిటీలో స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుబాటు సంస్థ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేత అల్‌గోలానీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఆక్రమణలతో తిరుగుబాటుదారులు మున్ముందుకు రాకుండా రోజుల తరబడి నిలువరిస్తూ ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
2011 మార్చిలో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. చివరకు తుర్కియే దన్నుతో తిరుగుబాటుదారులు, జిహాద్ ఉగ్రవాదులు, సిరియా వ్యతిరేక శక్తుల సమూహంగా కొత్త రూపం సంతరించుకుని ఇటీవలి కాలంలో ఉధృతమైంది. ప్రస్తుతం అస్సాద్ ప్రభుత్వపాలనానీడలో కేవలం కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గతంలో అస్సాద్‌కు పూర్తి అండదండలు అందించిన రష్యా, ఇరాన్‌లు ఇప్పుడు సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్నాయి.
మిత్ర దేశం సిరియాకు సైనిక, ఆర్థిక సాయం చేసేంత తీరిక వాటికి లేదు. ఉక్రెయిన్‌తో రష్యా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధంలో మునిగిపోవడం తెల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుని ఇటీవలి కొద్దినెలలుగా తిరుగుబాటుదారులు తమ ఆక్రమణలకు వేగం పెంచారు. తిరుగుబాటుదారులు బుధవారం ఆక్రమించిన హమా పేరు మూడు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 1982 ఊచకోత ఈ నగరంలోనే జరిగింది. అస్సాద్ తండ్రి హఫీజ్ కర్కశ ఏలుబడిలో ప్రభుత్వం ఇస్లామిక్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి ఊచకోతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment