తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా.. అధ్యక్షుడు అసద్‌ విమానం కూల్చివేత! | Syrian Rebels Announce End Of Dark Era | Sakshi
Sakshi News home page

తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా.. అధ్యక్షుడు అసద్‌ విమానం కూల్చివేత!

Published Sun, Dec 8 2024 11:38 AM | Last Updated on Sun, Dec 8 2024 12:04 PM

Syrian Rebels Announce End Of Dark Era

డెమాస్కస్‌: సిరియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డెమాస్కన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ దేశం విడిచి పారిపోయారని రెబల్స్ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ కనిపించకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. అయితే, అసద్‌ విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్‌-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్ల సమాచారం ఇచ్చాయి. ఈ ప్రదేశం లెబనాన్‌ గగనతలం పరిధిలో ఉంది. ఎవరైనా దీనిని కూల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు..హెచ్‌టీఎస్‌ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని నగరం డెమాస్కస్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసద్‌, ఆయన కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను, అధికార చిహ్నాలను తిరుగుబాటుదారులు ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాము రాజధాని చుట్టూ బలమైన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నామని సిరియా హోం శాఖ చెబుతోంది. ఇక, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా.. సిరియా పరిస్థితులపై తిరుగుబాటుదారులు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా..‘50 ఏళ్ల అణచివేత, 13 ఏళ్ల నేరాలు, దౌర్జన్యాలు, సుదీర్ఘ కాలం అవస్థలు, యుద్ధం, ఆక్రమిత సేనల నియంత్రణ నేటితో ముగిశాయి. ఇది ఒక చీకటి యుగం. ఇక సిరియాలో సరికొత్త శకం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం సిరియా ఎదురు చూస్తోందని’ తెలిపారు.

అసద్‌ శకం ముగిసింది..
మరోవైపు సిరియా ఆర్మీ కమాండ్‌ ఇప్పటికే అధ్యక్షుడు అసద్‌ శకం ముగిసిందని తమ ఆఫీసర్లకు సమాచారం అందించినట్లు మీడియా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో సిరియా ప్రధాన ప్రతిపక్షం హది అల్‌ బహ్ర కూడా దేశ రాజధాని అసద్‌ నుంచి విముక్తి పొందిందని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement