
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘన విజయాన్ని సాధించింది. లేజర్ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకు విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. అహ్మద్‌నగర్‌లోని కేకే పర్వతశ్రేణి ప్రాంతంలో ఏబీటీ అర్జున్ ట్యాంక్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఢీకొట్టింది. లేజర్ కిరణాల ఆధారంగా పనిచేసే ట్యాంక్ విధ్వంసక క్షిపణులు లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు వాటి కదలికలను గమనిస్తూ ప్రయాణిస్తుంది.
లేజర్ కిరణాల సాయంతో మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ క్షిపణిని ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థల సాయంతో ప్రయోగించేలా సిద్ధం చేశారు. పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డెహ్రాడూన్)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి డీఆర్‌డీవో సిబ్బందిని, పరిశ్రమ వర్గాలను అభినందించారు.