ఏర్పాట్లపై రక్షణ శాఖ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో మరో కలికితురాయి చేరబోతుంది. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రం ఏర్పాటుతో జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద సముద్ర తీరంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 385 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రం నిర్మాణానికి ఈ నెల 26న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. శంకుస్థాపన అనంతరం నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై డీఆర్‌డీవో, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులతో కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుతో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు రానుందన్నారు. సమీక్షలో డీఆర్‌డీవో అడిషనల్ చీఫ్ ఇంజనీర్ కల్నల్ ఎంజీ తిమ్మయ్య, ఈఈ ఎం.వరప్రసాద్, డీఆర్వో ఎ.ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.చక్రపాణి, మచిలీపట్నం ఆర్డీవో జె.ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment