సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది.
వెబ్‌సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్‌సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్‌సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్‌సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు..
నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, వెబ్‌సైట్లను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్‌పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్‌పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్‌ఎల్)లను గుర్తించారు.
వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్‌పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్‌ఐఏకు బదిలీ?
బహిరంగ మార్కెట్‌లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్‌స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు.
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
Published Thu, Mar 30 2023 1:16 AM | Last Updated on Thu, Mar 30 2023 1:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment