సమాజీ ఆర్మీ చీఫ్ వల్లే వివాదం
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల ఆరోపణ
ముంబై: మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ వల్లే ‘ఆదర్శ్’ వివాదం చెలరేగిందని, నిజానికి అక్కడ స్థలవివాదం ఏమీ లేదని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆరోపించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 31 అంతస్తుల భవనం నిర్మించిన స్థలం నిజానికి రక్షణ శాఖకు చెందినది కాదని, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని తెలిపారు. భవనం నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు వివరించారు. ఈ సందర్భంగా వారు తాము సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం పొందిన డాక్యుమెంట్లను చూపించారు.
సంబంధిత స్థలం రక్షణ శాఖకు చెందినది కాదని తేలడంతో సీబీఐ తమపై పెట్టిన క్రిమినల్ కేసు వీగిపోయిందన్నారు. ఇదిలా ఉండగా, కార్గిల్ యుద్ధ వీరుల నిమిత్తం మొదట ఇక్కడ ఆరు అంతస్తుల భవనం నిర్మించాలని భావించారు. కాని తర్వాత ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్కడ 31 అంతస్తుల భవనసముదాయాన్ని నిర్మించారు. దీంతో అది వివాదంగా మారింది. కాగా మాజీ ఆర్మీచీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంథోనీని ఈ విషయమై తప్పుదోవ పట్టించారని సొసైటీ అడ్‌హక్ చైర్మన్, రిటైర్డ్ బ్రిగేడియర్ టి.కె.సిన్హా ఆరోపించారు.