కంటోన్మెంట్ (హైదరాబాద్): ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కైవేల ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. కీలకమైన స్థల సేకరణకు వీలుగా ఆర్మీ అంగీకారం తెలుపడంతో రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే మార్గాల్లో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. స్కైవేలకు ఆర్మీ స్థలాలు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్‌ఎంఏ), కంటోన్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. 2017లోనే చేపట్టిన జాయింట్ సర్వేలో కొన్ని మార్పులు, చేర్పులతో తుది నివేదికను రూపొందించారు.
రక్షణ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ప్రతిపాదిత రోడ్ల విస్తరణకు ఆర్మీ, కంటోన్మెంట్ 158 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. ప్రైవేటు స్థలాలు దీనికి అదనం. ఇక ప్రతిపాదిత మార్గాల్లో ప్రస్తుత రోడ్లను 60 మీటర్ల (196 అడుగులు)కు విస్తరించనున్నారు.
ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే ఏఓసీ మార్గంలో రోడ్ల మూసివేత అంశం కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈ ప్రాజెక్టును చేపట్టడంతో పాటు, సెక్రెటేరియట్‌ను కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేయాలని భావించింది. ప్రతిపాదిత సెక్రెటేరియట్ తూర్పు ద్వారం గుండా నేరుగా హకీంపేట వరకు రాజీవ్ రహాదారి మీదుగా, పడమర ద్వారం గుండా సుచిత్ర వరకు మేడ్చల్ హైవే మీదుగా రెండు స్కైవేలు నిర్మించాలని నిర్ణయించారు.
ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా సూత్రప్రాయ అంగీకారం తెలుపడంతో పాటు ఆర్మీ, కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జాయింట్ సర్వే కూడా పూర్తి చేశారు. ఈ మేరకు సెక్రెటేరియట్ కోసం 60 ఎకరాలు, స్కైవేలకు 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలాలు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కతే ల్చారు.
అయితే విలువైన స్థలాలను కోల్పోతున్న నేపథ్యంలో కంటోన్మెంట్‌కు ఏటా రూ.31 కోట్ల చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలని ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. సెక్రెటేరియట్ నిర్మాణ ప్రతిపాదనను కూడా విరమించుకుని, పాతభవనం తొలగించి నిర్మించారు.
90 కాదు..158 ఎకరాలు
వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ) కింద రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్–44) మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఈ మార్గాల్లో రోడ్డును 150 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు.
తాజాగా ఈ స్కైవేలను మెట్రో కోసం కూడా వినియోగించుకోవాల ని నిర్ణయించారు. దీంతో రెండు మార్గాలను సుమారు 200 అడుగుల మేర విస్తరించనున్నారు. దీంతో గతంలో 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలం మాత్రమే అవసరం కాగా, ప్రస్తుతం 158 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఈ ప్రతిపాదనకు ఆర్మీకూడా అంగీకరించడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయ్యింది.
70 శాతం దుకాణాలు బంద్
ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి స్థల సేకరణ చేపడితే కంటోన్మెంట్‌లో 70 శాతం కమర్షియల్ నిర్మాణాలు కనుమరు గు కానున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహ దారి మార్గంలో సికింద్రాబాద్ క్లబ్ నుంచి అల్వాల్ వరకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ రోడ్డు కొన్నిచోట్ల 10 మీటర్ల నుంచి, గరిష్టంగా 30 మీటర్ల వరకు మాత్రమే ఉంది. తాజాగా ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు దాదాపుగా తొలగించాల్సి వస్తుంది. ప్యారడైజ్– బోయిన్‌పల్లి మార్గంలోనూ కొన్ని వ్యాపార కేంద్రాలు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment