ఇండియన్ వార్‌షిప్
2013 ఆగస్ట్ 13.. నౌకాదళ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన సంభవించింది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ఐఎన్‌ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో అర్ధరాత్రి వరస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న సబ్‌మెరైన్ సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టార్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. సబ్‌మెరైన్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి.
యుద్ధ నౌకలో గానీ.. సబ్‌మెరైన్‌లో గానీ.. చిన్నపాటి ప్రమాదం సంభవిస్తే.. అది భారీ విపత్తుగా మారుతుంది. అగ్నిమాపక వ్యవస్థ ఉన్నప్పటికీ.. క్షణాల్లో వ్యాపించే ప్రమాదాన్ని మాత్రం నియంత్రించలేకపోతుంది. సింధు రక్షక్‌లో ప్రమాదం తర్వాత.. ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత నౌకాదళం.. రష్యా, అమెరికా వంటి దేశాల వ్యవస్థను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడా పరిస్థితిని అధిగమించి..అగ్రరాజ్యాల సరసన నిలిచేలా అత్యాధునిక మ్యాగజైన్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్(ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్)ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అత్యంత కీలకమైన నౌకా దళాల్లో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఉన్న భారత్‌లో రోజు రోజుకూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికనుగుణంగా వ్యవస్థలోనూ అత్యాధునిక మార్పులు తీసుకొచ్చేందుకు రక్షణ వ్యవస్థ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రక్షణ సేవల రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న క్రౌన్ గ్రూప్(డిఫెన్స్ ఇంజినీరింగ్ డివిజన్) ఇప్పుడు ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను భారత నౌకాదళంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
మ్యాగజైన్ ఇక సురక్షితం
ప్రతి యుద్ధ నౌక, సబ్‌మెరైన్‌లో మ్యాగజైన్ అనే కంపార్ట్‌మెంట్ ఉంటుంది. ఇందులో పేలుడు పదార్థాలు, యుద్ధ సామగ్రిని సురక్షితంగా నిల్వ చేస్తారు. ఈ కంపార్ట్‌మెంట్‌ను అత్యంత సురక్షితంగా డిజైన్ చేస్తారు. ఆయా యుద్ధ సామగ్రికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, రేడియేషన్‌లో మార్పులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా.. మొత్తం యుద్ధనౌకతో పాటు పొరపాటున డాక్‌లో యాంకరేజ్ అయి ఉంటే.. పక్కన ఉన్న నౌకలు కూడా ప్రమాదం బారిన పడతాయి. అందుకే వీటిలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే అగ్నిమాపక వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో క్రౌన్ గ్రూప్ ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు రక్షణ వ్యవస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటైతే.. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో మాదిరిగా పేలుడు సంభవిస్తే.. సెకన్ల వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలరు.
విశాఖలో షిప్ బిల్డింగ్‌కు సన్నాహాలు
డిఫెన్స్ సర్వీస్ సెక్టార్‌లో ప్రధాన పాత్రధారిగా ఉన్న క్రౌన్ గ్రూప్ విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా షిప్ బిల్డింగ్ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే నగరంలో వర్క్‌షాప్ కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్ సంస్థ.. తూర్పు నౌకాదళ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, రీఫిట్, ఆపరేషనల్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. విశాఖ తీరంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే హిందూస్థాన్ షిప్‌యార్డు విశాఖలో ఉంది. ఇప్పుడు మరో షిప్‌యార్డు వస్తే.. యుద్ధ నౌకల తయారీలో విశాఖ నగరం కీలకంగా మారనుంది.
యుద్ధ నౌకలు.. సబ్‌మెరైన్‌లో...
ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చర్స్(ఓఈఎం) సహకారంతో నౌకాదళంలోని యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు అవసరమైన సామర్థ్యాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత నౌకాదళంలో మొత్తం 150 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లుండగా.. రానున్న ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య 180 వరకు చేరుకోనుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా 30 వరకూ యుద్ధ నౌకలు ఆయా షిప్‌యార్డుల్లో తయారవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
షిప్‌లో మ్యాగజైన్ కంపార్ట్‌మెంట్
రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తాం
విశాఖ తీరం ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకంగా ఉంది. అందుకే ఇక్కడ షిప్ బిల్డింగ్ సంస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ తీరంలో వ్యూహాత్మక షిప్‌యార్డ్‌లను కొనుగోలు చేయడం లేదా.. భాగస్వామిగా జతకట్టాలని భావిస్తున్నాం. తూర్పు తీర ప్రధాన కేంద్రంగా ఉన్న వైజాగ్‌కు దక్షిణ భాగంలో షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఐఎన్‌ఎస్ జలాశ్వ, విమాన వాహక నౌక విక్రమాదిత్యకు మరమ్మతులు, సర్వీసింగ్, మెయింటెనెన్స్ వంటి సవాళ్లతో కూడిన పనిని విజయవంతంగా పూర్తి చేసి.. పీఎఫ్‌ఆర్, మిలాన్ విన్యాసాలకు సిద్ధం చేశాం. భవిష్యత్‌లో అన్ని యుద్ధనౌకలకు ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ అత్యవసరం కాబట్టి ఈ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం.
– కమాండర్ రాకేష్ ఆనంద్, క్రౌన్ మెరైన్ డివిజన్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment