సదస్సులో మాట్లాడుతున్న బిపిన్ రావత్
హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలంటే ఆర్మీకి ఆధునిక సాంకేతికత అవసరమని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘దేశ రక్షణ రంగ తయారీలో స్వావలంభన’అంశంపై ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్‌లో జరిగిన 2 రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది. సదస్సుకు హాజరైన యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగ నిపుణులను ఉద్దేశించి రావత్ మాట్లాడారు. పరిశ్రమలతో సంబంధాలు కొనసాగించడంలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లతో పోలిస్తే ఆర్మీ కాస్త వెనకబడి ఉండటం బాధాకరమన్నారు. పరిశ్రమలు, రక్షణ రంగానికి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు.
రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలకు తమ తో కలసి పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ఇందుకోసం ‘ఆర్మీ డిజైన్ డివిజన్’వేదికగా పనిచేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఆ వేదికను సంప్రదిస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఆర్మీ అవసరాలు, సమస్యలు, సవాళ్లతో కూడిన 4 నివేదికలను సిద్ధం చేశామని, వాటి మీద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారు ముందుకురావచ్చని పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సుతో సరైన నిర్ణయాలు..
ఉపగ్రహా, డ్రోన్‌ల వ్యవస్థలతోపాటు పలు రకాలుగా వచ్చే సమాచారాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ), బిగ్ డేటా ఎనలిటి క్స్ సహకారంతో విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారముందని అన్నారు. రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోగలిగితే దిగుమతి చేసుకునే సమస్య ఉండదన్నారు. ఇందుకు దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రక్షణ రంగ నిపుణులు వీఎస్ హెగ్డే, సందీప్ ఉన్నితన్, లెఫ్టినెంట్ జనరల్ డీబీ షేకట్కర్, సంజయ్ పరషార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment