సాక్షి, విశాఖపట్నం : ఆత్మ నిర్భర్ భారత్‌ను ఇనుమడింపజేసేలా విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. షిప్ రిపేర్ హబ్‌గా పరుగులు తీస్తున్న హెచ్‌ఎస్‌ఎల్.. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన సింధుకీర్తి సబ్‌మెరైన్ రీఫిట్, మరమ్మతులకు సంబంధించి రక్షణశాఖతో సోమవారం ఎంవోయూ చేసుకుంది. రూ.934 కోట్లతో నిర్వహించే ఈ భారీ పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి తన ప్రతి ష్టను మరింత పెంచుకునేందుకు షిప్‌యార్డు సిద్ధమవుతోంది. దీనిద్వారా స్థానిక ఎంఎస్‌ఎంఈలకు 1,000 పనిదినాల ఉపాధిని హెచ్‌ఎస్‌ఎల్ కల్పించనుంది.
గతంలో తీవ్ర జాప్యం...
సింధుకీర్తి సబ్‌మెరైన్ 2006లో మరమ్మతుల కోసం హెచ్‌ఎస్‌ఎల్‌కు రాగా, తొమ్మిదేళ్లకు పూర్తిచేశారు. అయినప్పటికీ ఇటీవల రికార్డు స్థాయిలో రీఫిట్ పనులను పూర్తిచేస్తూ ప్రపంచదేశాల చూపును తనవైపు తిప్పుకుంటూ ఇతర దేశాల నౌకల మరమ్మతుల బాధ్యతలను కూడా హెచ్‌ఎస్‌ఎల్ చేపడుతోంది. అందువల్లే భారత రక్షణశాఖ చొరవ తీసుకొని ఆత్మ నిర్భర్ భారత్ కింద సింధుకీర్తి సబ్‌మెరైన్ రీఫిట్ బాధ్యతలను షిప్‌యార్డుకి అప్పగిస్తూ భారీ ఎంవోయూ కుదుర్చుకుంది.
ప్రస్తుతం సింధుకీర్తి రీఫిట్ పనులను 22 నెలల్లో పూర్తి చేస్తామని హెచ్‌ఎస్‌ఎల్ ఒప్పందంలో పేర్కొంది. రూ.934 కోట్ల ఈ భారీ ఒప్పందం ద్వారా 20కిపైగా హెచ్‌ఎస్‌ఎల్‌తో కలిసి పనిచేస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపాధి కలగనుంది. మొత్తం 1,000 పనిదినాలు ఎంఎస్‌ఎంఈలకు ఉపాధి కల్పించనున్నట్లు షిప్‌యార్డు ప్రకటించింది. నిర్ణీత 22 నెలల కంటే ముందుగానే సింధుకీర్తి సబ్‌మెరైన్ పనులు పూర్తిచేసి అప్పగించేందుకు కృషి చేస్తామని షిప్‌యార్డు ఉద్యోగులు ప్రతినబూనడం విశేషం.
పెద్ద చాలెంజ్‌గా స్వీకరిస్తున్నాం
కారణాలేమైనా గతంలో సింధుకీర్తి మరమ్మతుల విషయంలో చాలా ఆలస్యం జరిగింది. దానివల్ల ఎదురైన అవమానాలను భరించి మరమ్మతుల విషయంలో ఎన్నో సంస్కరణలు అమలుచేశాం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నిర్దేశించిన కాలపరిమితిలోపే రీఫిట్ పనులను పూర్తి చేస్తూ విదేశీ ఆర్డర్లు కూడా పొందుతున్నాం. ఇప్పుడు హెచ్‌ఎస్‌ఎల్ ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది.
ఐదేళ్లలో ఏకంగా 14 ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇప్పటివరకు 200 నౌకలు తయారు చేయడంతోపాటు 2,000 షిప్స్ మరమ్మతు పనులను పూర్తిచేశాం. విశాఖను షిప్ రిపేర్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు సింధుకీర్తి ద్వారా వచ్చిన పెద్ద సవాల్‌గా భావించి మేమంతా దానిని స్వీకరిస్తున్నాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, హెచ్‌ఎస్‌ఎల్ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment