స్వయంకృతాపరాధం | Sakshi Editorial On Self-inflicted Vladimir Putin Russia | Sakshi
Sakshi News home page

స్వయంకృతాపరాధం

Published Tue, Jun 27 2023 3:18 AM | Last Updated on Tue, Jun 27 2023 5:49 AM

Sakshi Editorial On Self-inflicted Vladimir Putin Russia

పాలు పోసి పెంచిన పాము కాటేయడానికి పడగ విప్పి మీదకొస్తే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుంది. శత్రు దేశాలపై దాడి కోసం తాను పెంచిపోషిస్తూ వచ్చిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ ప్రైవేట్‌ మిలటరీ కంపెనీ’, దాని అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్‌ ఒక్కసారిగా తన మీదకే విరుచుకుపడేసరికి పుతిన్‌ దిగ్భ్రమకు లోనైనట్టున్నారు. గత వారాంతంలో రష్యాలో దాదాపు అంతర్యుద్ధం అంచులకు వెళ్ళిన పరిణామాలు అలాంటివి.

దేశానికి దక్షిణాన అతి కీలక నగరాల్లో ఒకటైన రోస్తోవ్‌ – ఆన్‌– డాన్‌ చేజిక్కించుకొని, మాస్కో దిశగా వాగ్నర్‌ కిరాయి సైనికులు దూసుకు వస్తున్నప్పుడు పరిస్థితి భయానకంగా కనిపించింది. పైకి ఎన్ని బీరాలు పలికినా, చివరకు బెలారస్‌ దేశాధినేత కుదిర్చిన సంధితో పుతిన్‌ ఊపిరిపీల్చుకో గలిగారు. ఇప్పటికి వాగ్నర్‌ సేనలు వెనక్కి తగ్గి, ఉక్రెయిన్‌తో పోరుకు మళ్ళీ సరిహద్దుల దారి పట్టినా, పుతిన్‌కు తగిలిన షాక్, ఆయన ఇమేజ్‌కు పడిన దెబ్బ సామాన్యమైనవి కావు. 

ఎవరికీ వంగని, దేనికీ లొంగని ధీరుడిగా పేరున్న పుతిన్‌ ప్రతిష్ఠను ఈ తిరుగుబాటు చావుదెబ్బ తీసింది. ఉక్రెయిన్‌తో పోరులో బింకంగా ముందడుగు వేస్తున్న ఆయన ఈ దెబ్బ నుంచి కోలుకో వడం సులభమేమీ కాదు. 1999 నుంచి ఇప్పటి దాకా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారంలో ఉంటూ వచ్చారు పుతిన్‌. రష్యాపై తిరుగులేని పట్టు బిగించిన ఈ ఏలిక తన సుదీర్ఘ హయాంలో తొలిసారిగా పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు.

‘పుతిన్‌కు వంటగాడ’నే పేరు దక్కిన ఒక దొంగ, హంతకుడు ఆ స్థాయి నుంచి ప్రైవేట్‌ సైనిక సంస్థకు అధిపతిగా ఎదగడం వెనక ఉన్నది పుతినే అన్నది జగమెరిగిన సత్యం. ఆఫ్రికా నుంచి అరబ్‌ ప్రపంచం వరకు, తాజా ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ ఈ కిరాయి మూకల్ని వాడుకుంటూ వచ్చిందీ పుతినే! అందుకే, పూర్తి బాధ్యత కూడా ఆయనదే!

ఉక్రెయిన్‌పై కార్యకలాపాల్లో రష్యా సైనికాధిపతుల పట్ల, ముఖ్యంగా రక్షణ మంత్రి పట్ల ప్రిగోజిన్‌ కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. రక్షణ శాఖలో అగ్రస్థానంలో మార్పుల్ని కోరుకుంటున్నారు. ఆఖరికి ఆయన కిరాయి మూకలు తేలిగ్గా ఒక్కో నగరం దాటుకుంటూ మాస్కో సమీపా నికి రావడం అంతర్యుద్ధ మేఘాలను అలముకొనేలా చేసింది. బెలారస్‌ నేత లుక షెంకో తెరవెనుక రాజీతో ఇప్పటికి గండం గడిచింది.

పుతిన్‌ మీద ప్రేమ కన్నా, డబ్బు కోసమనే ప్రాణాలకు తెగించే వాగ్నర్‌ మూకలు వెనుదిరగడం ఊరికే జరగలేదు. దేశద్రోహులంటూ వీరంగం వేసిన పుతిన్‌ చివరకు ఎవరిపై ఏ కేసులూ పెట్టనని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రిగోజిన్‌పై చర్యలుండవని హామీ ఇవ్వాల్సొచ్చింది. రెండు లక్షల కోట్ల డాలర్ల కన్నా తక్కువకు పడిపోయిన జీడీపీతో, ఉక్రెయిన్‌తో పోరులో నష్టాలతో సతమతమవుతున్న రష్యా కొత్తగా మరో పోరు చేసే పరిస్థితిలో లేదు.

వెరసి, తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్‌పై 16 నెలల క్రితం యుద్ధం మొదలుపెట్టి, వెనక్కి రాలేని పద్మవ్యూహంలో చిక్కుకున్న పుతిన్‌కు ప్రపంచం ముందు ఇవి తీరని తలవంపులే. ఇవన్నీ ఆయన స్వయంకృతాపరాధాలే. బలమైన వాగ్నర్‌ మూకల్ని రక్షణ శాఖ కిందకు తేవాలన్న రష్యా సైనిక నేతల నిర్ణయం బెడిసికొట్టింది. వ్యూహంలో, దాడుల్లో తమ కన్నా వెనుకబడిన ప్రభుత్వ సైనిక నేతల కింద పనిచేయడం ప్రిగోజిన్‌కు మింగుడుపడని విషయం.

అందువల్లే ఈ తిరుగుబాటు తలెత్తిందట. పుతిన్‌కు తాను వ్యతిరేకం కాదనే నేటికీ ప్రిగోజిన్‌ మాట. ఏమైనా, ఇప్పుడు రష్యాకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇకపై ఉక్రెయిన్‌పై పోరులో రష్యన్‌ సైనిక నేతలు మునుపటిలా ఈ కిరాయి మూకల్ని నమ్మలేరు. రక్షణ శాఖతో కాంట్రాక్ట్‌ ఉన్నవారే ఇకపై పోరులో పాల్గొంటారట. కానీ, అపనమ్మకమున్న యుద్ధంలో అడుగు ముందుకు పడదు. అసలే ఉక్రెయిన్‌లో ఆశించిన పురోగతి లేక అస్తుబిస్తవుతున్న పుతిన్‌కు ఇది దెబ్బ మీద దెబ్బ.

తాజా తిరుగుబాటులో చేరని వాగ్నర్‌ ఫైటర్లను ప్రభుత్వ సైన్యంలోకి తీసుకోవాలని రష్యా యోచిస్తున్నప్పటికీ, ఇలాంటి మూకలతో రష్యా ఎలా వేగగలదో చెప్పలేం. ప్రిగోజిన్‌ తిరుగుబాటు ఇప్పటికి టీ కప్పులో తుపానైపోయినా, క్షీణిస్తున్న పుతిన్‌ పట్టుకు అది ప్రతీక. అణ్వస్త్ర రష్యా సైనిక బలగంలోని బలహీనతలూ, చీలికలూ బట్టబయలయ్యాయి.

సైనిక జనరల్స్‌ను ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తూ వస్తున్న పుతిన్‌కు యుద్ధంలో తగిన వ్యూహమూ ఉన్నట్టు లేదు. మరోపక్క, తాజా ఘటనలతో యుద్ధంలో ఉక్రెయిన్‌ సైన్యానికి ఊహించని సానుకూలత వరించింది. ఒకవేళ యుద్ధాన్ని ముగించదలుచుకుంటే ఇరుపక్షాలకూ ఓ చిన్న కిటికీ తెరుచుకుంది. కానీ, కిందపడ్డా నాదే పై చేయి అనే పుతిన్‌ కానీ, ‘నాటో’ బూచితో రష్యాను దారికి తెచ్చుకోవాలని చూస్తున్న పాశ్చాత్య ప్రపంచం కానీ అందుకు ముందుకొస్తాయా?  

ఏమైనా రష్యా పరిణామాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. పుతిన్‌ తదుపరి అడుగులు, భవి తవ్యంపై లెక్కలు కడుతోంది. సైన్యం, పాలనా యంత్రాంగం, వ్యాపార వర్గం సహా వ్యవస్థలన్నిటినీ విడగొట్టి, ఎవరూ అధికారం ప్రోది చేసుకోకుండా బలహీనంగా ఉంచి, నియంత్రణ తన చేతిలో పెట్టుకొనే పుతిన్‌ ఈ విన్యాసం ఎన్నాళ్ళు చేయగలరో చూడాలి.

అందుకే, స్టాలిన్‌ తర్వాత దీర్ఘకాలం రష్యాను ఏలుతున్న పుతిన్‌ ఓ అమెరికన్‌ రాజకీయ శాస్త్రవేత్త అన్నట్టు ఒక రకంగా ‘బలహీన బలిష్ఠుడు’. వాగ్నర్‌ వ్యవహారం అందుకు తాజా ఉదాహరణ. పామును పెంచుతున్నది పగవాణ్ణి కాటేయడానికని భావించినా విషపురుగుకు తన, పర తేడా ఉండదని మర్చిపోవడమే చిక్కు. ఆ సంగతి అమెరికా, పాకిస్తాన్‌ నుంచి ఇప్పుడు రష్యా దాకా అందరికీ అనుభవంలోకి వచ్చిన పాఠమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement