ఉక్రెయిన్‌పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి | Russia Launches Massive Missile Attack At Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి

Published Wed, Dec 25 2024 5:05 PM | Last Updated on Wed, Dec 25 2024 6:37 PM

Russia Launches Massive Missile Attack At Ukraine

కీవ్‌ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్‌ దాడి చేసింది. కజాన్‌ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్‌పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.

క్రిస్టమస్‌ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్‌ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్‌స్కీ ప్రశ్నించారు. 


ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు.  

నగరాలపై దాడులు
ఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లోని అపార్ట్‌మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్‌మెంట్‌లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్‌పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్‌లో వెల్లడించారు.

అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్‌లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement