యుద్ధాలు అధికారానికి సోపానాలా? | Indo-Pakistani wars and conflicts | Sakshi
Sakshi News home page

యుద్ధాలు అధికారానికి సోపానాలా?

Published Sun, Mar 10 2019 4:08 AM | Last Updated on Sun, Mar 10 2019 9:28 AM

Indo-Pakistani wars and conflicts - Sakshi

ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి.

దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్‌ పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్‌ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.

ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ కోసం భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్‌ బలం భారీగా పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్‌ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్‌ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

మూడో భారత్‌–పాక్‌ యుద్ధం(1971)
బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్‌ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది.

మొదటి భారత్‌–పాక్‌  యుద్ధం(1947)
కశ్మీర్‌ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్‌– 1948 డిసెంబర్‌ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది.

భారత్‌–చైనా యుద్ధం (1962)
1962, అక్టోబర్‌ 20 నుంచి 1962 నవంబర్‌ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్‌ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 361 సీట్లు సాధించింది.

ఐపీకేఎఫ్‌ (1987)
శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్‌ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది.

రెండో భారత్‌–పాక్‌  యుద్ధం(1965)
లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి.

కార్గిల్‌ యుద్ధం(1999)
బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్‌ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్‌ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల  కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement