టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.
కోహ్లి శతకాలు@81
కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్‌లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్‌తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.
కోహ్లి అద్భుతం
కఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.
సఫారీ గడ్డపై కఠినమైన పిచ్‌లపై కూడా బ్యాట్‌తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్‌లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.
అందరికీ సాధ్యం కాదు
ఇక ఇదే మ్యాచ్‌లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు.
ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.
బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్
అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.
భారీ విజయంతో మొదలు
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.
ఈ మ్యాచ్‌లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment