ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్‌ వైరల్‌ | Dhoni Unmissable Reaction As Preity Zinta Celebrates Shashank Dropped Catch | Sakshi
Sakshi News home page

ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్‌ వైరల్‌

Published Wed, Apr 9 2025 11:44 AM | Last Updated on Wed, Apr 9 2025 11:59 AM

Dhoni Unmissable Reaction As Preity Zinta Celebrates Shashank Dropped Catch

Photo Courtesy: BCCI/JioHotstar

ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ (PBKS vs CSK) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జోష్‌లో ఉన్న రుతురాజ్‌ సేనకు.. ఆ తర్వాత వరుస షాకులు తగిలాయి. పంజాబ్‌ యువ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (Priyansh Arya) ఆకాశమే హద్దుగా చెలరేగి.. చెన్నై బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.

పంజాబ్‌ @ 219 
తాను ఇచ్చిన క్యాచ్‌లను డ్రాప్‌ చేసి లైఫ్‌ ఇచ్చిన ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం లేకుండా వీరబాదుడు బాదాడు. కేవలం 42 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఏకంగా తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. అయితే, నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ క్యాచ్‌ పట్టడంతో ఎట్టకేలకు ప్రియాన్ష్‌ ఆర్య సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అయితే, ఈ ఆనందాన్ని శశాంక్‌ సింగ్‌, మార్కో యాన్సెన్‌ సీఎస్‌కే ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శశాంక్‌ సింగ్‌ 36 బంతుల్లో 52.. యాన్సెన్‌ 19 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.

చిన్న పిల్లలా గెంతులేస్తూ
అయితే, ఇన్నింగ్స్‌ రెండో బంతికే ప్రియాన్ష్‌ ఆర్య ఇచ్చిన క్యాచ్‌ మిస్‌ చేయడం ద్వారా.. పంజాబ్‌ భారీ స్కోరుకు చేజేతులా బీజం వేసిన సీఎస్‌కే.. ఆ తర్వాత మరో రెండుసార్లు లైఫ్‌ ఇచ్చింది. దీంతో అతడు మెరుపు శతకంతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు యజమాని ప్రీతి జింటా చిన్న పిల్లలా గెంతులేస్తూ ప్రియాన్ష్‌ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

 

స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ ప్రీతి.. ధోని  సీరియస్‌
మరోవైపు.. శశాంక్‌ సింగ్‌ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించగా.. టాప్‌ ఎడ్జ్‌కు తాకి బంతి గాల్లోకి లేచింది. అయితే, అతడు ఇచ్చిన క్యాచ్‌ను రచిన్‌ రవీంద్ర డ్రాప్‌ చేశాడు. అప్పటికి శశాంక్‌ సింగిల్‌ పూర్తి చేసుకున్నాడు. అయితే, మరో చెత్త విషయం ఏమిటంటే.. ఓవర్‌త్రో కారణంగా పంజాబ్‌కు మరో అదనపు పరుగు లభించింది.

ఈ క్రమంలో ప్రీతి జింటా.. స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే, అదే సమయంలో చెన్నై మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని కోపం పట్టలేక సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇక పంజాబ్‌ విధించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసి.. 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీఎస్‌కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (36), డెవాన్‌ కాన్వే (69 రిటైర్డ్‌ అవుట్‌), శివం దూబే (42), ధోని (27) ఫర్వాలేదనిపించారు. కాగా ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. 

 

చదవండి: PBKS Vs CSK: గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement