మయాంక్‌ యాదవ్‌, నితీశ్‌ రెడ్డికి బంపరాఫర్‌! | India thinking of taking Mayank Yadav Nitish Other Reserves to Australia: Rohit | Sakshi
Sakshi News home page

మయాంక్‌ యాదవ్‌, నితీశ్‌ రెడ్డికి బంపరాఫర్‌!

Published Tue, Oct 15 2024 3:39 PM | Last Updated on Tue, Oct 15 2024 4:16 PM

India thinking of taking Mayank Yadav Nitish Other Reserves to Australia: Rohit

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో సత్తా చాటిన యువ క్రికెటర్లు మయాంక్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డిల రాత మారిపోయింది. ఇటీవలే వీరిద్దరు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్‌, నితీశ్‌ సెలక్టర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

కివీస్‌తో సిరీస్‌కు...
ఈ సిరీస్‌లో స్పీడ్‌స్టర్‌ మయాంక్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా.. రెండో టీ20లో నితీశ్‌ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌(34 బంతుల్లో 74)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరిని రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపికచేశారు సెలక్టర్లు. తాజాగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీరికి మరో శుభవార్త అందించాడు. కివీస్‌తో సిరీస్‌లో వీరిని టెస్టుల్లో ఆడించే ఉద్దేశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. 

టెస్టు క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారో? లేదో?
‘‘యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాం. అయితే, వాళ్లు ఎక్కువగా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడలేదు. అయినప్పటికీ వారిలోని నైపుణ్యాలకు మరింత పదునుపెట్టేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. అందుకే మరింత నిశితంగా పరిశీలించేందుకు వీలుగా రిజ్వర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాం.

తమకు దొరికిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. టెస్టు క్రికెట్‌ ఆడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. మా బెంచ్‌ స్ట్రెంత్‌ను పెంచుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.

గాయాల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ బ్యాకప్‌ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సిరీస్‌లో వారు మాతో పాటే ప్రయాణిస్తారు కాబట్టి.. దగ్గరగా గమనిస్తాం. వర్క్‌లోడ్‌ను మేనేజ్‌ చేయగలరా? జట్టుకు ఎంతమేర ఉపయోగపడతారు? అన్న అంశాలు పరిశీలిస్తాం.

ముఖ్యంగా ఎక్కువ మంది ఫాస్ట్‌ బౌలర్లు అందుబాటులో ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. మా దగ్గర ఇప్పుడు 8- 9 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్‌ విభాగంలోనూ వీలైనంత మంది అందుబాటులో ఉన్నారు.   

ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉంది
వీరిలో చాలా మంది దులిప్‌ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఆడారు. ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లను కివీస్‌తో టెస్టులకు రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేయడానికి కారణం.. వాళ్లను దగ్గరగా గమనించి ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉండటమే’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

కాగా ఫాస్ట్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌తో పాటు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి, పేసర్‌ హర్షిత్‌ రాణా న్యూజిలాండ్‌ టెస్టులకు ట్రావెలింగ్‌ రిజర్వులుగా ఉన్నారు. కాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున వికెట్లు పడగొట్టిన మయాంక్‌ గాయం కారణంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 

అనంతరం, జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరి పునరావాసం పొందాడు. తర్వాత నేరుగా టీమిండియాలో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌ చేరడంలో ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్ రెడ్డి ‌కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వగలిగాడు.

చదవండి: షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్‌ శర్మ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement