మెల్‌బోర్న్‌లోనే అగార్కర్‌?.. రోహిత్‌ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే! | Rohit Sharma To Retire After BGT Series? Report Makes Big Agarkar Claim | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో ఉన్న అగార్కర్‌?.. రోహిత్‌ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!

Published Fri, Dec 27 2024 9:15 PM | Last Updated on Fri, Dec 27 2024 9:20 PM

Rohit Sharma To Retire After BGT Series? Report Makes Big Agarkar Claim

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) త్వరలోనే రిటైర్‌ కానున్నాడా? బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో గనుక భారత జట్టు ఓడిపోతే.. అతడు టెస్టుల నుంచి కూడా తప్పుకుంటాడా?.. క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ప్రధానంగా నడుస్తున్న చర్చ ఇదే!

వరుస వైఫల్యాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్‌ శర్మపై తీవ్ర విమర్శలు రావడానికి కారణం అతడి పేలవ ఫామ్‌. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆటగాడిగా.. కెప్టెన్‌గా రోహిత్‌ విఫలమయ్యాడు. సొంతగడ్డపై కివీస్‌తో సిరీస్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా.. 2, 52, 0, 8, 18, 11.

ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. తద్వారా భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో.. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలిసారి ఇంతటి ఘోర పరాభవాన్ని చవిచూసింది. 

ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(World Test Championship డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్‌ చేరాలంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో కచ్చితంగా నాలుగు టెస్టులు గెలవాల్సిన స్థితిలో నిలిచింది.

చావో- రేవో
అయితే, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో టీమిండియాను ముందుకు నడిపించిన జస్‌ప్రీత్‌ బుమ్రా భారీ విజయం అందించాడు. ఇక రెండో టెస్టు నుంచి రోహిత్‌ జట్టుతో చేరినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.

రోహిత్‌ కెప్టెన్సీలో ఆసీస్‌ చేతిలో పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. మూడో టెస్టులోనూ విఫలమై.. వర్షం కారణంగా అదృష్టవశాత్తూ డ్రా చేసుకోగలిగింది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలోనూ రోహిత్‌ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు ఇన్నింగ్స్‌ ఆడి 3, 6, 10 పరుగులు చేశాడు.

ఓపెనర్‌గా వచ్చినా నో యూజ్‌!
ఇక మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టులోనూ రోహిత్‌ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు, మూడు టెస్టుల్లో మిడిలార్డర్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఈ టెస్టులో మాత్రం తన రెగ్యులర్‌ స్థానంలో ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. కానీ.. ఈసారి కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు.

ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో మరో పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. నిజానికి అనవసరపు షాట్‌కు యత్నించి అతడు వికెట్‌ పారేసుకోవడంతో విమర్శలు మరింత పదునెక్కాయి.

మెల్‌బోర్న్‌లోనే అగార్కర్‌?.. రోహిత్‌ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!
ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అంశం మరోసారి చర్చకు వచ్చింది. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో గనుక భారత జట్టు ఓడిపోతే.. రోహిత్‌ శర్మ భవిష్యత్తు గురించి కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

రోహిత్‌ మనసులో ఏముందో?
అదే విధంగా.. రోహిత్‌ సైతం ఈసారి తన సారథ్యంలో భారత్‌ డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైతే.. రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. 37 ఏళ్ల హిట్‌మ్యాన్‌ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. 

కాగా డబ్ల్యూటీసీ మొట్టమొదటి సీజన్‌ 2019-21లో కోహ్లి కెప్టెన్సీలో ఫైనల్‌ చేరిన టీమిండియా.. న్యూజిలాండ్‌కు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక 2021-23 సీజన్‌లో రోహిత్‌ సేన ఫైనల్‌కు చేరుకున్నా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

ఈసారి మాత్రం ఫైనల్‌కు చేరేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మపై మునుపెన్నడూ లేని విధంగా ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా కెప్టెన్‌ హోదాలో టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత రోహిత్‌ కేవలం టెస్టు, వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement