హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో రోహిత్ శర్మ
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Test Retirement) ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.
సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలం
కాగా సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతోంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా.. రోహిత్ కెప్టెన్సీలో అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది.
కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తాజాగా ముగిసిన మెల్‌బోర్న్ టెస్టులో రోహిత్(3, 9) తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాడు. పట్టుమని పది పరుగులు చేయకుండానే అవుటయ్యాడు.
త్వరగా రిటైర్ పోవాలంటూ
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. త్వరగా రిటైర్ పోవాలంటూ హిట్‌మ్యాన్‌కు సూచనలు వస్తున్నాయి. అయితే, ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం.
టెస్టులకు గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!
ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి సెలక్టర్లు, బీసీసీఐ నాయకత్వంతో చర్చించిన రోహిత్ శర్మ.. సిడ్నీ టెస్టులో ఓడితే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడట. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిచి.. టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే అవకాశాలు ఉంటే మాత్రం.. ఆ మెగా మ్యాచ్ వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.
ఏదేమైనా సిడ్నీ టెస్టుతో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యంపై ఒక అంచనాకు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.
గణాంకాలు ఇవీ
కాగా టెస్టుల్లో గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు ఇవే 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అయితే, ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది. కానీ.. 37 ఏళ్ల రోహిత్ వికెట్ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్‌పై చర్చలు ఎక్కువయ్యాయి.
టీమిండియాకు చేదు అనుభవాలు
ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు జరుగనుంది. జనవరి 3-7 వరకు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. పెర్త్‌లో భారత్ 275 పరుగులతో గెలవగా.. అడిలైడ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వర్షం వల్ల బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా కాగా.. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ 184 పరుగుల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసింది. తద్వారా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment