BCCI: గంభీర్‌ను ఇంకోసారి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు పంపకండి: భారత మాజీ క్రికెటర్‌ | Sanjay Manjrekar Shock Message To BCCI: Never Send Gambhir For Press Conference | Sakshi
Sakshi News home page

గంభీర్‌ను ఇంకోసారి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు పంపకండి.. బీసీసీఐకి షాకింగ్‌ మెసేజ్‌

Published Mon, Nov 11 2024 3:07 PM | Last Updated on Mon, Nov 11 2024 4:27 PM

Sanjay Manjrekar Shock Message To BCCI: Never Send Gambhir For Press Conference

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. దయచేసి అతడిని మరోసారి మీడియా సమావేశానికి పంపవద్దంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశాడు. గంభీర్‌కు బదులు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌నే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు పంపాలని సూచించాడు.

టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాత
కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. గంభీర్‌ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో సోమవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. 

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్న గౌతీ.. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

నష్టమేమీ లేదు
అదే విధంగా.. రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లిల ఫామ్‌ గురించి తమకు ఆందోళన లేదంటూ.. వారిని విమర్శిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌కు గౌతీ కౌంటర్‌ ఇచ్చాడు. ఇక కివీస్‌ చేతిలో పరాభవం నుంచి పాఠాలు నేర్చకుంటామని.. విమర్శలను స్వీకరిస్తూనే ముందడుగు వేస్తామని పేర్కొన్నాడు. 

అంతేకాదు.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదంటూ నెటిజన్లకు కౌంటర్‌ ఇచ్చాడు. అయితే, కొన్నిసార్లు మీడియా ప్రశ్నలకు గంభీర్‌ దూకుడుగా.. మరికొన్నింటికి దాటవేత ధోరణి అవలంబించినట్లుగా కనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. 

అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయం
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఇందాకే గంభీర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ చూశాను. అతడిని ఇలాంటి పనులకు దూరంగా ఉంచితేనే బీసీసీఐకి మంచిది.

అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయం. మీడియాతో మాట్లాడేటపుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి పదాలు వాడాలో అతడికి తెలియదు. రోహిత్‌, అగార్కర్‌ అతడి కంటే చాలా బెటర్‌. వాళ్లిద్దరినే మీడియా ముందుకు పంపిస్తే మంచిది’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

నాలుగు గెలిస్తేనే
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25లో చివరగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌ వేదికగా నవంబరు 22 నుంచి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ మొదలుకానుంది. ఇందులో భాగంగా భారత్‌- ఆసీస్‌ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.

చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్‌ కొడుకు.. ఎమోషనల్‌ వీడియో! స్త్రీగా మారినందు వల్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement