అశ్విన్‌ బాటలో రోహిత్‌ శర్మ?!.. హిట్‌మ్యాన్‌ సమాధానం ఇదే! | Is Rohit Sharma To Follow R Ashwin Lead Retire Hitman Says My Body | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ బాటలో రోహిత్‌ శర్మ?!.. హిట్‌మ్యాన్‌ సమాధానం ఇదే!

Published Thu, Dec 19 2024 9:24 PM | Last Updated on Thu, Dec 19 2024 9:28 PM

Is Rohit Sharma To Follow R Ashwin Lead Retire Hitman Says My Body

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి సారథ్యంలో భారత జట్టు 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇప్పటికి మిశ్రమ ఫలితాలే వచ్చాయి.

పితృత్వ సెలవుల కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్‌ దూరం కాగా.. పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్‌బౌలర్‌ నేతృత్వంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అడిలైడ్‌లో కంగారూలతో పింక్‌ బాల్‌ టెస్టుకు రోహిత్‌ శర్మ అందుబాటులోకి వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.

రోహిత్‌ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేదంటే.. పరిస్థితి ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఇక అడిలైడ్‌, బ్రిస్బేన్‌లో రెగ్యులర్‌ ఓపెనింగ్‌ స్థానంలో కాకుండా.. ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్‌ ఆడి అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 3, 6, 10. దీంతో కెప్టెన్‌గా రోహిత్‌ తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో బ్రిస్బేన్‌ టెస్టు ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అనుకున్న ఫలితం రాకపోతే రోహిత్‌ కూడా గుడ్‌బై చెబుతాడనే వదంతులు వ్యాపించాయి.

అయితే, రోహిత్‌ శర్మ మాత్రం వాటిని కొట్టిపడేశాడు. ‘‘నేను సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయానన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఎల్లవేళలా మెరుగ్గా ఆడేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. అనుకున్న లక్ష్యాలలో దాదాపుగా అన్నిటినీ చేరుకున్నాను.

క్రీజులో మరింత ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా శరీరం, నా మనసు సహకరించినంత కాలం.. నేను ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఈ ప్రయాణంలో విధి నాకోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తా’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా చెరో విజయం సాధించి.. మూడో టెస్టును డ్రా చేసుకున్నాయి. ఫలితంగా సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.

తదుపరి డిసెంబరు 26- 30 మధ్య బాక్సింగ్‌ డే టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌తో పాటు.. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులోనూ గెలిస్తేనే.. భారత్‌ ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకునే వీలుంటుంది. 

చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్‌ తండ్రి సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement