విజయ మధురం | India beat Australia by 8 wickets in Melbourne | Sakshi
Sakshi News home page

విజయ మధురం

Published Wed, Dec 30 2020 3:57 AM | Last Updated on Wed, Dec 30 2020 9:40 AM

India beat Australia by 8 wickets in Melbourne - Sakshi

విజయానంతరం గిల్, కెప్టెన్‌ రహానే

పది రోజుల్లో ఎంత తేడా... అత్యల్ప స్కోరు సాధించిన అవమాన భారంతో తలవంచుకున్న భారత ఆటగాళ్లు ఇప్పుడు సగర్వంగా నిలబడ్డారు. అడిలైడ్‌ పరాభవం తర్వాత అన్ని ప్రతికూలతలను అధిగమించిన టీమిండియా మెల్‌బోర్న్‌లో మెరిసింది. గత ఓటమి బాధను మరచిపోయేలా చేస్తూ అసాధారణ విజయంతో ఏడాదిని ముగించింది. తొలి రోజు నుంచి ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన రహానే సేన చివరి వరకు ఆ పట్టును నిలబెట్టుకుంది. ఫలితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపుతో సిరీస్‌ను సమం చేసింది. నాలుగో రోజు ఆసీస్‌ మరో 67 పరుగులు జోడించి ఆలౌట్‌ కాగా... 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శతకంతో జట్టును నడిపించిన సారథి రహానే విన్నింగ్‌ షాట్‌తో టీమిండియా బృందంలో ఆనందం వెల్లివిరియగా ఆసీస్‌ పెవిలియన్‌లో నిశ్శబ్దం వినిపించింది. ఇక కొత్త సంవత్సరంలోనూ ఇదే జోరు సాగించి బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకోవడమే భారత్‌ తక్షణ లక్ష్యం!   

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను భారత్‌ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్‌ గ్రీన్‌ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్‌ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్‌ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. శుబ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 35 నాటౌట్‌; 7 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అజింక్య రహానే (40 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి జట్టును విజయతీరం చేర్చారు.  ఆస్ట్రేలియాతో ‘సెంచరీ’ టెస్టులో భారత్‌కు విక్టరీ అందించారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీలో జరుగుతుంది.

ఆకట్టుకున్న సిరాజ్‌
ఆసీస్‌ చివరి వరుస బ్యాట్స్‌మన్‌ అంత సులభంగా లొంగలేదు. మిగిలిన నాలుగు వికెట్లు తీసేందుకు భారత్‌కు 37.1 ఓవర్లు పట్టాయి. గ్రీన్, కమిన్స్‌ (103 బంతుల్లో 22; ఫోర్‌) కలిసి పోరాడుతూ ఏడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఎట్టకేలకు ఒక షార్ట్‌ బంతితో కమిన్స్‌ను అవుట్‌ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. కొద్ది సేపటికి సిరాజ్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌కు ప్రయత్నించిన గ్రీన్‌... జడేజా చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత లయన్‌ (15 బంతుల్లో 3)ను సిరాజ్‌ అవుట్‌ చేయగా, హాజల్‌వుడ్‌ (21 బంతుల్లో 10)ను బౌల్డ్‌ చేసిన అశ్విన్‌ ఆసీస్‌ ఆట ముగించాడు.

పుజారా నిరాశ
లక్ష్యం చిన్నదే అయినా 19 పరుగుల వద్దే జట్టు రెండు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళన రేపింది. మయాంక్‌ అగర్వాల్‌ (5) మరోసారి విఫలమవ్వగా, పుజారా (3) కూడా పేలవ షాట్‌ ఆడి గల్లీలో క్యాచ్‌ ఇచ్చాడు. తన సహజ ధోరణికి భిన్నంగా పుజారా కాలితో గ్రౌండ్‌ను తన్ని, ఆపై బౌండరీ వద్ద ప్రకటనల హోర్డింగ్‌ను కూడా బ్యాట్‌తో కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు! అయితే ఆ తర్వాత గిల్, రహానే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించారు. చివరకు లయన్‌ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా పుల్‌ షాట్‌ ఆడి సింగిల్‌ తీయడంతో భారత్‌ గెలుపు పూర్తయింది.

ఆస్ట్రేలియాపై మరో దెబ్బ!
అసలే ఓటమి భారంతో ఉన్న ఆసీస్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) షాక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆ జట్టు మ్యాచ్‌ ఫీజులో 40 శాతం జరిమానా విధించడంతో పాటు కీలకమైన నాలుగు ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లను కూడా తగ్గించింది. నిర్ణీత సమయంకంటే ఆస్ట్రేలియా 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్‌కు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు పాయింట్ల చొప్పున కోత విధిస్తారు. ఆసీస్‌ దిగ్గజం డేవిడ్‌ బూన్‌ ఈ మ్యాచ్‌ రిఫరీ కావడం విశేషం!
   
సిడ్నీలోనే మూడో టెస్టు

భారత్, ఆస్ట్రేలియా మధ్య షెడ్యూల్‌ ప్రకారం జనవరి 7 నుంచి సిడ్నీలోనే మూడో టెస్టు జరుగుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) అధికారికంగా ప్రకటించింది. న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ వేదికను సిడ్నీ నుంచి మార్చవచ్చని, అవసరమైతే మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు జరపాలని ఇప్పటి వరకు ప్రతిపాదనలు వచ్చాయి. సిడ్నీలో మంగళవారం మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని షరతులతో టెస్టును నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కట్టుదిట్టమైన కోవిడ్‌–19 ఆంక్షల నేపథ్యంలో ఆటగాళ్లు సిడ్నీకి ప్రయాణించనున్నారు.

► మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో భారత్‌ సాధించిన టెస్టు విజయాల సంఖ్య. విదేశీ గడ్డపై భారత్‌ అత్యధిక విజయాలు అందుకున్న వేదికగా ఎంసీజీ అవతరించింది. క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ (ట్రినిడాడ్‌), సబీనా పార్క్‌ (జమైకా), సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (కొలంబో) మైదానాల్లో భారత్‌ మూడేసి టెస్టుల్లో గెలిచింది. ఇంగ్లండ్, భారత్‌ మాత్రమే ఎంసీజీలో నాలుగు అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై గెలిచాయి.
 
► అజింక్య రహానే సెంచరీ చేసిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. రహానే 12 సెంచరీలు చేయగా... 8 టెస్టుల్లో భారత్‌ గెలిచింది (వీటిలో ఓ టెస్టులో అతను రెండు సెంచరీలు చేశాడు). మరో మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది.

► ఆస్ట్రేలియా గడ్డపై టాస్‌ ఓడిపోయి టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం 2003 తర్వాత భారత్‌కిదే తొలిసారి. 2003లో అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఈ తరహా లోనే గెలిచింది. విదేశీ గడ్డపై మాత్రం 2010 తర్వాత భారత్‌కు ఇలాంటి విజయం దక్కింది. 2010లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ భారత్‌ టాస్‌ ఓడాక గెలుపు రుచి చూసింది.  

► ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లోని తొలి టెస్టులో ఓడిపోయి రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసిన మూడో జట్టుగా భారత్‌ నిలిచింది. గతంలో వెస్టిండీస్‌ (1975–76 సీజన్‌); న్యూజిలాండ్‌ (2011లో) ఇలా చేశాయి.  

► వరుసగా రెండు పర్యటనల్లో ఎంసీజీ మైదానంలో రెండు వరుస టెస్టులు నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 1977, 1980లలో ఇలా నెగ్గిన భారత్‌ 2018, 2020లో పునరావృతం చేసింది.  

► స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత జరిగింది. చివరిసారి 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓడిపోయింది.  

► లసిత్‌ మలింగ (శ్రీలంక; 6/92; 2004లో) తర్వాత గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా సిరాజ్‌ (5/77) నిలిచాడు. సిరాజ్‌తోపాటు గతంలో ఫిల్‌ డిఫ్రిటాస్‌ (ఇంగ్లండ్‌; 5/94; 1986లో), అలెక్స్‌ ట్యూడర్‌ (ఇంగ్లండ్‌; 5/108; 1998లో) కూడా ఆస్ట్రేలియాలో తమ అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు తీశారు.

గర్వంగా ఉంది: రహానే
మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ముఖ్యంగా కొత్త కుర్రాళ్లు సిరాజ్, గిల్‌ చూపిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. సాధారణంగా అరంగేట్ర ఆటగాళ్లు అత్యుత్సాహంతో తమపై నియంత్రణ కోల్పోతారు. కానీ నాలుగైదేళ్ల ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అనుభవం ఉన్న వీరిద్దరు అలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో కెప్టెన్‌ పని సులువైంది. తొలి రోజు పదో ఓవర్లోనే బౌలింగ్‌కు దిగి అశ్విన్‌ ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం బాగా పని చేసింది. ఆల్‌రౌండర్‌గా జడేజా తన విలువ చూపించాడు. అడిలైడ్‌లో ఒక్క గంటలో మ్యాచ్‌ చేజారింది. అయితే దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్లలేకపోయాం. మేం అలా చేయలేదు. మరింత పట్టుదలతో, దూకుడుతో ఇక్కడ బరిలోకి దిగాలని అనుకున్నాం. ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా రాణిస్తే ఫలితం రాబట్టగలమని తెలుసు.  
–అజింక్య రహానే, భారత కెప్టెన్‌

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 195; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 326;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 4, లబ్‌షేన్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 28, స్మిత్‌ (బి) బుమ్రా 8, హెడ్‌ (సి) మయాంక్‌ (బి) సిరాజ్‌ 17, గ్రీన్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 45, పైన్‌ (సి) పంత్‌ (బి) జడేజా 1, కమిన్స్‌ (సి) మయాంక్‌ (బి) బుమ్రా 22, స్టార్క్‌ (నాటౌట్‌) 14, లయన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 3, హాజల్‌వుడ్‌ (బి) అశ్విన్‌ 10, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (103.1 ఓవర్లలో ఆలౌట్‌) 200.  
వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99, 7–156, 8–177, 9–185, 10–200.
బౌలింగ్‌: బుమ్రా 27–6–54–2, ఉమేశ్‌ యాదవ్‌ 3.3–0–5–1, సిరాజ్‌ 21.3–4–37–3, అశ్విన్‌ 37.1–6–71–2, రవీంద్ర జడేజా 14–5–28–2.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) పైన్‌ (బి) స్టార్క్‌ 5, గిల్‌ (నాటౌట్‌) 35, పుజారా (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 3, రహానే (నాటౌట్‌) 27, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 70.
వికెట్ల పతనం: 1–16, 2–19.
బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–20–1, కమిన్స్‌ 5–0–22–1, హాజల్‌వుడ్‌ 3–1–14–0, లయన్‌ 2.5–0–5–0, లబ్‌షేన్‌ 1–0–9–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement