218 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో 172/0
మెరిసిన జైస్వాల్, రాహుల్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 104 ఆలౌట్
బుమ్రాకు 5 వికెట్లు
బౌలర్ల అసమాన ప్రదర్శనకు... ఓపెనర్ల సహకారం తోడవడంతో పెర్త్ టెస్టుపై టీమిండియాకు పట్టు చిక్కింది. తొలి రోజు పేస్‌కు స్వర్గధామంలా కనిపించిన పిచ్‌పై రెండో రోజు భారత ఓపెనర్లు చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ్రస్టేలియా బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోగా... జైస్వాల్, రాహుల్ అర్ధశతకాలతో అజేయంగా నిలిచారు.
అంతకుముందు మన పేసర్ల ధాటికి ఆ్రస్టేలియా 104 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్... మూడోరోజు ఇదే జోరు కొనసాగిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో బోణీ కొట్టడం ఖాయం!
పెర్త్: ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అన్న చందంగా... తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్ సెలెక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్‌లో సాధికారికంగా ఆడటంతో ఆ్రస్టేలియాతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కంగారూ పేసర్ల కఠిన పరీక్షకు భారత ఓపెనర్లు సమర్థవంతంగా ఎదురు నిలవడంతో పెర్త్ టెస్టులో బుమ్రా సేన పైచేయి దిశగా సాగుతోంది.
ఓవర్‌నైట్ స్కోరు 67/7తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మిషెల్ స్టార్క్ (112 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (21) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగినా... స్టార్క్ మొండిగా పోరాడాడు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా... హర్షిత్ రాణా 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (193 బంతుల్లో 90 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువవగా... తొలి ఇన్నింగ్స్‌లో సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరిన రాహుల్ (153 బంతుల్లో 62 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయతి్నంచినా ఆసీస్ ఈ జోడీని విడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు 17 వికెట్లు కూలగా... రెండో రోజు మూడు వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారకపోయినా... భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించనుంది.
స్టార్క్ అడ్డుగోడలా..
తొలి రోజు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన భారత బౌలర్ల సహనానికి రెండోరోజు స్టార్క్ పరీక్ష పెట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తలపిస్తూ తన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు.
ఓవర్‌నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీని కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన బుమ్రా... టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. నాథన్ లయన్ (5) కూడా త్వరగానే ఔట్ కాగా... చివరి వికెట్‌కు హాజల్‌వుడ్ (31 బంతుల్లో 7 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి స్టార్క్ చక్కటి పోరాటం కనబర్చాడు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ఎన్ని ప్రయోగాలు చేసినా సాధ్యపడలేదు.
ఈ ఇద్దరు పదో వికెట్‌కు 110 బంతుల్లో 25 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించారు. చివరకు హర్షిత్ బౌలింగ్‌లో స్టార్క్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫలితంగా భారత జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఓపెనింగ్ అజేయం
తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ... రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే అయినా... భీకర పేస్‌తో విజృంభిస్తున్న కంగారూ బౌలర్లను కాచుకుంటూ జైస్వాల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్లిష్టమైన బంతుల్ని డిఫెన్స్ ఆడిన ఈ జోడీ... చెత్త బంతులకు పరుగులు రాబట్టింది. జైస్వాల్ కచ్చితమైన షాట్ సెలెక్షన్‌తో బౌండరీలు బాదాడు. రాహుల్ డిఫెన్స్‌తో కంగారూలను కలవరపెట్టాడు.
సమన్వయంతో ముందుకు సాగిన ఓపెనర్లిద్దరూ బుల్లెట్లలాంటి బంతుల్ని తట్టుకొని నిలబడి... గతితప్పిన బంతులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3.01 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట జైస్వాల్ 123 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కాసేపటికి రాహుల్ 124 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు.
టెస్టు క్రికెట్‌లో జైస్వాల్‌కు ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్‌సెంచరీ కాగా... ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. రెండు సెషన్‌ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన ఆసీస్ బౌలర్లు... మూడో రోజు తొలి సెషన్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేదానిపై భారత ఆధిక్యం ఆధారపడి ఉంది. మైదానంలో బాగా ఎండ కాస్తుండటంతో... నాలుగో ఇన్నింగ్స్‌లో పగుళ్లు తేలిన పిచ్‌పై లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చు.
రికార్డు స్థాయిలో ప్రేక్షకులు
పెర్త్ టెస్టుకు అభిమానులు ఎగబడుతున్నారు. రెండో రోజు శనివారం ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 32,368 మంది అభిమానులు వచ్చారు. ఈ స్టేడియం చరిత్రలో టెస్టు మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకుల హాజరు కావడం ఇదే తొలిసారి. ‘భారత్, ఆ్రస్టేలియా తొలి టెస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తొలి రెండు రోజుల్లో 63,670 మంది మ్యాచ్‌ను వీక్షించారు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచ్ (2006–07 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మ్యచ్)కు అత్యధికంగా 1,03,440 మంది హాజరయ్యారు. ఇప్పుడు తాజా టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... ఇంకో 39,771 మంది తరలివస్తే ఆ రికార్డు బద్దలవనుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ రాణా 26; లయన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ రాణా 5; హాజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 104. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59, 8–70, 9–79, 10–104. బౌలింగ్: బుమ్రా 18–6–30–5, సిరాజ్ 13–7–20–2, హర్షిత్ రాణా 15.2–3–48–3, నితీశ్ రెడ్డి 3–0–4–0, సుందర్ 2–1–1–0.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172. బౌలింగ్: స్టార్క్ 12–2–43–0, హాజల్‌వుడ్ 10–5–9–0, కమిన్స్ 13–2–44–0, మార్ష్ 6–0–27–0, లయన్ 13–3–28–0, లబుషేన్ 2–0–2–0, హెడ్ 1–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment