బ్రిస్బేన్‌లో చెమటోడ్చిన టీమిండియా
రేపటి నుంచి ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠోర సాధన చేస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడమే లక్ష్యంగా సాగుతున్న టీమిండియా గురువారం బ్రిస్బేన్‌లో చెమటోడ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా నిలవగా... శనివారం నుంచి మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. దీని కోసం గురువారమే బ్రిస్బేన్ చేరుకున్న రోహిత్ శర్మ బృందం... రోజంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా... ఈసారి కూడా అదే మ్యాజిక్ కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ కొట్టాలని భావిస్తోంది. అడిలైడ్‌లో ‘పింక్ బాల్’తో జరిగిన రెండో టెస్టులో పరాజయంతో జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లి... గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సహచరుల్లో స్ఫూర్తి నింపాడు.
తిరిగి పుంజుకునే విధంగా యువ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చాడు. బుమ్రా, రోహిత్‌తోనూ కోహ్లి విడిగా చర్చిస్తూ కనిపించాడు. గత మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన కెపె్టన్ రోహిత్ శర్మ... మూడో టెస్టులో ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ అటు కొత్త బంతితో పాటు... పాత బంతితోనూ సాధన కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొత్త బంతితో ప్రాక్టీస్ చేశారు.
పచ్చికతో కూడిన గబ్బా పిచ్... పేస్‌కు, బౌన్స్‌కు సహకరించడం ఖాయం కాగా... రోహిత్ ఓపెనర్‌గానే బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమే మేలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో గంభీర్ సుదీర్ఘంగా సంభాషిoచాడు.
ఆకాశ్‌కు అవకాశం దక్కేనా!
నెట్స్‌లో భారత బౌలర్లంతా తీవ్రంగా శ్రమించగా... పేసర్ ఆకాశ్‌దీప్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయినా మూడో టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టమే. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా రెండో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడప్పుడే అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా... ప్రాక్టీస్‌లో ఆకాశ్ బౌలింగ్ చూస్తుంటే హర్షిత్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వడమే మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడో టెస్టు జరగనున్న పిచ్ హర్షిత్ బౌలింగ్ శైలికి సహకరించే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీల్లో సత్తాచాటిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పాల్గొనే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ టోర్నీలో షమీ సత్తా చాటినా... టెస్టు మ్యాచ్‌కు అవసరమైన ఫిట్‌నెస్ అతడు ఇంకా సాధించలేదు.
‘షమీ గాయం నుంచి కోలుకున్నా... ఇంకా మడమ వాపు పూర్తిగా తగ్గలేదు. ఎక్కువ పనిభారం పడితే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ముందు ఒక్కో మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు మూడు స్పెల్స్ వేయాల్సి ఉంటుంది.
ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగుతాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మూడో టెస్టులోనూ భారత జట్టు ఏకైక స్పిన్నర్‌తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి.
జైస్వాల్ బస్ మిస్..
రెండో టెస్టు ముగిసిన అనంతరం గురువారం అడిలైడ్ నుంచి బ్రిస్బేన్‌కు బయలుదేరే సమయంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్ణీత సమయానికి టీమ్ బస్ వద్దకు చేరుకోలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జైస్వాల్‌ను అక్కడే వదిలి మిగిలిన జట్టుతో ఎయిర్‌పోర్ట్‌కు పయనమయ్యాడు. జట్టు సభ్యులంతా వచి్చన తర్వాత కూడా జైస్వాల్ అక్కడికి రాకపోవడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు.
ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో... జట్టు సభ్యులంతా గం 8:30కి హోటల్ నుంచి బయలుదేరగా... జైస్వాల్ సమయానికి రాలేకపోయాడు. దీంతో 20 నిమిషాల అనంతరం హోటల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో జైస్వాల్‌ను విమానాశ్రయానికి చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment