మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 405/7
హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలు
బుమ్రాకు 5 వికెట్లు
బ్రిస్బేన్‌లో తొలి రోజు వరుణుడు విజృంభిస్తే... రెండో రోజు ఆ్రస్టేలియా బ్యాటర్లు వీర విహారం చేశారు. ట్రావిస్ హెడ్ టీమిండియాపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మరో సెంచరీతో విరుచుకుపడగా... స్టీవ్ స్మిత్ సాధికారిక సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు సాధించింది.
భారత మేటి పేసర్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... అతనికి సహచర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దాంతో ఆ్రస్టేలియా మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాన్ని సృష్టించుకుంది. మూడో రోజు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న ఈ పోరులో భారత బ్యాటర్ల ఆటతీరుపైనే టీమిండియా ఆశలు ఆధారపడి ఉన్నాయి.
బ్రిస్బేన్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా జట్టు అదరగొట్టింది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో విజృంభించిన ఆ్రస్టేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.
భారత్‌తో మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగే ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 152; 18 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ శతకంతో విజృంభించగా... చాన్నాళ్లుగా ఫామ్‌లో లేని మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 101; 12 ఫోర్లు) రికార్డు సెంచరీతో రాణించాడు. వీరిద్దరి అసమాన ప్రదర్శన ముందు... బుమ్రా (5/72) ఒంటరి పోరాటం చిన్నబోయింది.
వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (47 బంతుల్లో 45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో రెండో రోజు ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓవరాల్‌గా రెండో రోజు 377 పరుగులు జతచేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆసీస్ ఇంకెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం.
తొలి సెషన్ మనదే...
వర్ష సూచన మధ్య ప్రారంభమైన రెండో రోజు ఆటలో మొదట మన బౌలర్లు ఆకట్టుకున్నారు. బుమ్రాకు వికెట్ సమరి్పంచుకోకూడదు అనే సంకల్పంతో ముందుకు సాగిన ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (54 బంతుల్లో 21), నాథన్ మెక్‌స్వీనీ (49 బంతుల్లో 9) చివరకు అతడి బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన బుమ్రా... వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపాడు.
దీంతో ఆ్రస్టేలియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు మెరుగైన ఆరంభమే లభించినట్లు అనిపించింది. లబుషేన్ (55 బంతుల్లో 12)తో పాటు ఆరంభంలో స్మిత్ అతి జాగ్రత్తకు పోవడంతో భారత బౌలర్లదే పైచేయి అయింది. గంటకు పైగా క్రీజులో గడిపినా... ఒక్క షాట్ ఆడలేకపోయిన లబుషేన్ చివరకు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
దీంతో ఆసీస్ 75/3తో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్‌పై టీమిండియా పట్టు సాధించడం ఖాయమే అనే అంచనాలకు వస్తున్న తరుణంలో... స్మిత్‌తో కలిసి హెడ్ వీరోచితంగా పోరాడాడు. మొత్తానికి తొలి సెషన్ ముగిసేసరికి ఆసీస్ 104/3తో నిలిచింది.
12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు
మూడో సెషన్ ఆరంభలోనూ స్మిత్, హెడ్ జోరు సాగింది. నాలుగో వికెట్‌కు 241 పరుగులు జత చేసిన తర్వాత ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. టెస్టు ఫార్మాట్‌లో 25 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్... మూడంకెల స్కోరు చేసిన వెంటనే పెవిలియన్ చేరగా... పేస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్‌స్టంప్ లైన్‌లో బుమ్రా వేసిన బంతికి మార్ష్ స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అదే ఓవర్‌లో హెడ్ కూడా ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ట్రవిస్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో ఇకనైనా ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడుతుందని ఆశిస్తే... వికెట్ కీపర్ అలెక్స్ కేరీ దాన్ని అడ్డుకున్నాడు. కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (20)తో కలిసి ధాటిగా ఆడుతూ కీలక పరుగులు జోడించాడు.
గాయం కారణంగా కాసేపు మైదానానికి దూరమైన సిరాజ్... ఆఖరికి ఒక వికెట్ పడగొట్టగా... కేరీతో పాటు మిషెల్ స్టార్క్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. తదుపరి మూడు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్‌స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (బ్యాటింగ్) 45; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 405.
వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385. బౌలింగ్: బుమ్రా 25–7–72–5; సిరాజ్ 22.2–4–97–1; ఆకాశ్‌దీప్ సింగ్ 24.4–5–78–0; నితీశ్ కుమార్ రెడ్డి 13–1–65–1; రవీంద్ర జడేజా 16–2–76–0.
భారీ భాగస్వామ్యం
లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా గేర్ మార్చింది. అప్పటి వరకు రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఆసీస్ ప్లేయర్లు... ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. ముఖ్యంగా గత కొంతకాలంగా... టీమిండియాపై మెరుగైన ప్రదర్శన చేస్తూ... మన బౌలింగ్‌కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ అలరించాడు. రెండో సెషన్‌లో కెపె్టన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ జోడీకి పరోక్షంగా సహకరించాయి.
హెడ్ క్రీజులో కుదురుకునే సమయంలో ఫీల్డింగ్ మొహరింపు అనుకూలంగా ఉండటంతో అతడు సునాయాసంగా పరుగులు రాబట్టగలిగాడు. షార్ట్‌బాల్‌ను సరిగ్గా ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకునే విధంగా బౌలింగ్ సాగకపోగా... అడపాదడపా జరిగిన ప్రయాత్నాల్లో రోహిత్ థర్డ్ మ్యాన్‌ను మొహరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన హెడ్ ఆ తర్వాత దూసుకెళ్లాడు.
మరో ఎండ్ నుంచి స్మిత్ అతడికి చక్కటి సహకారం అందించాడు. టచ్‌లోకి వచ్చాక రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ హెడ్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయించేందుకు ప్రధాన పేసర్లను తప్పించడంతో ఆసీస్ జోడీ స్వేచ్ఛగా ముందుకు సాగింది.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన స్మిత్... లయ అందుకున్నాక ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఇబ్బంది పడినట్లు కనిపించిన స్మిత్... మిగిలిన వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో సెషన్‌లో ఆసీస్ జట్టు వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది.
1 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక సెంచరీలు (15) చేసిన ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ మాజీ కెపె్టన్ పాంటింగ్ (14) పేరిట ఉన్న ఈ రికార్డును స్మిత్ అధిగమించాడు. జో రూట్ (13) మూడో స్థానంలో ఉన్నాడు.
టీమిండియాపై వన్డేల్లో 5 శతకాలు బాదిన స్మిత్, టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. ఇక భారత్, ఆ్రస్టేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక (10) సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. సచిన్ (11) అగ్రస్థానంలో ఉన్నాడు.
1 టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్‌పై 12 శతకాలు నమోదు చేసిన స్మిత్‌కు భారత్‌పై ఇది పదో సెంచరీ.
2 టెస్టుల్లో ఆ్రస్టేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో స్మిత్ (33) రెండో స్థానానికి చేరాడు. బ్రిస్బేన్ మ్యాచ్‌లో శతకంతో స్మిత్... స్టీవ్ వా (32)ను దాటేశాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
12 టెస్టు మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం బుమ్రాకిది 12వ సారి. భారత పేసర్లలో కపిల్‌దేవ్ 16 సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా... బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.
10 ఆసియా ఆవలి పిచ్‌లపై బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది పదోసారి. ఈ జాబితాలో కపిల్‌దేవ్ (9)ను అధిగమించి బుమ్రా అగ్రస్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment