రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజా
ఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.
పేలవ ఫామ్‌ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబే
ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు.
ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్‌వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్‌కు బెంబేలెత్తించారు.
తీరు మార్చుకోని గిల్
గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది.
కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్‌సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment