‘ముంబై’ దోషులకు శిక్ష పడాల్సిందే
అప్పటిదాకా భారత్ సంతృప్తి చెందదు: ఆంటోనీ
26/11కు ఐదేళ్లు
న్యూఢిల్లీ/రాంచీ: ముంబై దాడుల దోషులకు గరిష్ట శిక్ష పడేంత వరకు భారత్ సంతృప్తి చెందదని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ పాకిస్థాన్‌కు స్పష్టంచేశారు. దాడులకు పాల్పడ్డవారి వివరాలు, ఆ కుట్ర మూలాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్‌కు గతంలోనే ఇచ్చినట్లు చెప్పారు. ముంబైలో పాక్ ముష్కరుల దాడులకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పొరుగు దేశం నుంచి ఏమి ఆశిస్తున్నారని పాత్రికేయులు ప్రశ్నించగా.. ‘‘దోషులను చట్టం ముందు నిలబెట్టాలని వారికి (పాక్‌కు) అనేకమార్లు చెప్పాం. దాడికి కారకులైనవారిని తీవ్రంగా శిక్షించనంత వరకు భారత్ సంతృప్తి చెందదు’’ అని చెప్పారు. 2008, నవంబర్ 26న పాక్ నుంచి సముద్రతీరం గుండా వచ్చిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో నరమేధం సృష్టించి 160 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ముందు తీర గస్తీ బలహీనంగా ఉండేదని, కానీ ఇప్పుడు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆంటోనీ చెప్పారు.
దారి తప్పినవారిని క్షమిస్తాం: షిండే
దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నవారిని క్షమించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి షిండే అన్నారు. మావోయిస్టులను ఉద్దేశించి ఆయన రాంచీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హింస దేనికీ పరిష్కారం కాదు. మనలో కొందరు యువకులు దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నారు. వారు మనలో ఒకరే. హింసను వీడి జనస్రవంతిలోకి వస్తామంటే వారిని క్షమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు.