పాట్నాలో ఆదివారం వరుస బాంబుపేలుళ్ల ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొంత పురోగతి సాధించింది. ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి మరో నిందితుడిగా అనుమానిస్తున్న తాబిష్ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి బుధవారం పాట్నాలో వెల్లడించారు. తాబిష్ను మోతీహారి జిల్లాలో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ఆ బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో మహ్మద్ ఇమితియాజ్ అన్సారీ ఇచ్చిన సమాచారం మేరకు తాబిష్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పేలుళ్ల ప్రధాన సూత్రదారిగా భావిస్తున్న ఇంతియాజ్ను తాబిష్ తరచుగా కలిసేవాడని తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఆదివారం పాట్నాలలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది.
అక్కడ అనుమానితుగా ఉన్న ఇంతియాజ్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తులో ఇంతియాజ్ కీలక సమాచారం అందించాడు. దాంతో ఎన్ఐఏ అధికారులు తాబిష్ను అరెస్ట్ చేశారు. పాట్నాలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.