Patna blasts
-
పాట్నా పేలుళ్ల అనుమానితులు అరెస్ట్
రాంచీ : నరేంద్ర మోడీ టార్గెట్‌గా జరిగిన పాట్నా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 27 బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ హుంకార్ ర్యాలీ నిర్వహించింది. మోడీ ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రధాన వక్తగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించిన అనుమానితులుగా భావిస్తున్న హైదర్ అలీ, నుమస్, తౌఫిక్, ముజిబుల్లాను అరెస్ట్ చేశారు. -
మోడీ 'అసలుసిసలు రాజకీయాని'కి ప్రతీక
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిప్పులు చెరిగింది. 'పాట్నా పేలుళ్ల' ఘటనలో మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించి, ఓదార్చడాన్ని పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోడీ శనివారం బీహార్ పర్యటనను 'అసలుసిసలు రాజకీయాని'కి ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకుని 60 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ ఘర్షణలు చోటు చేసుకున్న ముజఫర్‌నగర్‌లో మోడీ ఎందుకు పర్యటించ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న ఆ మత ఘర్షణలకు సంబంధించిన వార్తులు మోడీ కంటికి కనిపించలేదా లేక చెవులకు వినిపించలేదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. పాట్నా పేలుళ్ల మృతుల కుటుంబాల మోడీ ఓదార్పు రాజకీయ క్రీడలో భాగమే అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అంతకు మించి ఏమీ లేదని పేర్కొంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం చాలా దురదృష్టమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రషీద్ అల్వీ ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరేంద్రమోడీ నిన్న బీహార్ పర్యటనపై ఆరోపణలు, ప్రశ్నాల పరంపరను సంధించారు. గత ఆదివారం పాట్నానగరంలో గాంధీ మైదాన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పాట్నా నగరంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం మోడీ బీహార్ చేరుకున్నారు. శనివారం మృతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కోక్క కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే. -
పాట్నా బాధితులకు మోడీ బాసట
పాట్నా నగరంలో గత ఆదివారం వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృత్యువాత పడిన ఆరుగురు కుటుంబ సభ్యులను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం వరుసగా పరామర్శిస్తున్నారు. మొదటగా మృతుల్లో ఒకరైన రాజ్ నారాయణ్ సింగ్ స్వగ్రామమైన పాట్నా జిల్లాలోని గౌరిచౌక్ సమీపంలోని కమార్జి గ్రామానికి శనివారం ఉదయం మోడీ చేరుకున్నారు. రాజ్ నారాయణ్ సింగ్ కుటుంబాన్ని మోడీ పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు. అనంతరం మరో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మోడీ కైమురు జిల్లాకు పయనమైయ్యారు. అక్కడి నుంచి నలందా, బెగుసరాయి, సుపాల్, గోపాల్‌గంజ్‌లోని మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. అయితే మోడీ పర్యటించే ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అందుకోసం భారీగా భద్రత దళాలను మోహరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గత ఆదివారం పాట్నా నగరంలో గాంధీ మైదాన్ల హూంకార్ ర్యాలీ బహిరంగ నిర్వహించారు. అయితే ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్ వద్ద బాంబు పేలుడుతోపాటు... గాంధీ మైదాన్ వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ఘటనతో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుడుకు బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు అమర్చుకుంటుండగా ప్రమాద వశాత్తు బాంబు పేలి ఒక నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో పోలీసులు అతడిని పాట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. తీవ్ర గాయాలతో నిందితుడు కోమాలోకి వెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. మోడీ పర్యటనలో ఆయన వెంటన ఆ పార్టీ సీనియర్ నేత నంద కిషోర్ యాదవ్ ఉన్నారు. -
బీహార్ 'ప్రభుత్వ అతిథి' హోదాలోమోడీ పర్యటన
పాట్నా: గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాస్తా బీహార్ ప్రభుత్వ అతిథిగా మారనున్నారు. పాట్నా బాంబు దాడి ఘటనలో మరణించిన కుటుంబాల్ని పరామర్శించేందుకు ఆయన బీహార్ రాష్ట్రానికి అతిథి హోదాలో వెళ్లనున్నారు. రేపట్నుంచి మోడీ తలపెట్టనున్న పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాష్ట్ర అతిథి హోదాలో ప్రోటాకాల్ ఉంటుందని కేబినెట్ సమన్యయ కమిటీ ముఖ్య కార్యదర్శి బ్రజేష్ మహరోత్రా తెలిపారు. కాగా, సీఎం హోదాలో ఉన్న మోడీ రాష్ట్ర అతిథి హోదాను కల్పించడంపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారు. అతను ఆ హోదాకు పూర్తిగా అర్హుడని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు. గత ఆదివారం పాట్నాలో మోడీ ర్యాలీకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు మోడీ శుక్రవారం పాట్నాకు చేరుకోనున్నారు. మరణించిన వారు వివిధ జిల్లాలకు చెందిన వారు కావడంతో మోడీ వారి స్వస్థలాకు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ ఘటనలో మొత్తం ఏడు పేలుళ్లు జరగగా, గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి. -
పాట్నా పేలుళ్ల కేసులో మరో నిందితుడు అరెస్ట్
పాట్నాలో ఆదివారం వరుస బాంబుపేలుళ్ల ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొంత పురోగతి సాధించింది. ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి మరో నిందితుడిగా అనుమానిస్తున్న తాబిష్ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి బుధవారం పాట్నాలో వెల్లడించారు. తాబిష్ను మోతీహారి జిల్లాలో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఆ బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో మహ్మద్ ఇమితియాజ్ అన్సారీ ఇచ్చిన సమాచారం మేరకు తాబిష్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పేలుళ్ల ప్రధాన సూత్రదారిగా భావిస్తున్న ఇంతియాజ్‌ను తాబిష్ తరచుగా కలిసేవాడని తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఆదివారం పాట్నాలలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ అనుమానితుగా ఉన్న ఇంతియాజ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తులో ఇంతియాజ్ కీలక సమాచారం అందించాడు. దాంతో ఎన్ఐఏ అధికారులు తాబిష్ను అరెస్ట్ చేశారు. పాట్నాలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
దిల్సుఖ్నగర్ పాత్రధారే పాట్నా సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో పాత్రధారిగా ఉన్న తెహసీన్ అక్తర్.. అక్టోబర్ 27 నాటికి పాట్నా పేలుళ్లలో సూత్రధారిగా మారాడు! ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ వాసిమ్ అక్తర్ షేక్ అలియాస్ మోను అలియాస్ హసన్ (23) స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఉన్న మనియార్పూర్ గ్రామం. కంప్యూటర్ విద్యను అభ్యసించిన మోను గతంలో నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)లో కీలకపాత్ర పోషించాడు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ ద్వారా ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతడి ఆదేశాల మేరకే అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (గత ఆగస్టులో యాసీన్ భత్కల్‌తో పాటు బీహార్‌లో అరెస్టయిన ఉగ్రవాది)తో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్సుఖ్నగర్ పేలుళ్లకు రంగంలోకి దిగాడు. హడ్డీ, వఖాస్‌లతో కలిసి నగరంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫిబ్రవరి 21న సైకిల్‌పై పెట్టుకున్న బాంబును ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద వదిలి వెళ్లాడు. 2011లో ముంబై వరుస పేలుళ్లు, వారణాసి పేలుళ్ల కేసులో కూడా తెహసీన్ నిందితుడు. ఆయా కేసులకు సంబంధించి ఎన్ఐఏ గత కొన్ని నెలల్లో పదిసార్లకు పైగా అతడి స్వగ్రామంలో గాలింపు చేపట్టింది. అతడిపై అరెస్ట్ వారంట్ జారీచేసిన ఎన్ఐఏ.. ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల బహుమతి కూడా ప్రకటించింది. అయినా ఫలితం దక్కలేదు. -
అది ఇండియన్ ముజాహిదీన్ దాడే
పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు పాట్నా/రాంచి: బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ లక్ష్యంగా జరిగిన వరుస పేలుళ్లు.. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని దర్యాప్తులో వెలుగుచూసింది. ఐఎం అగ్రనేత, ఇటీవల అరెస్టయిన యాసిన్భత్కల్కు కుడిభుజంగా పేరుపడ్డ తెహసీన్ అక్తర్ (దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాత్రధారి) పాట్నా పేలుళ్ల సూత్రధారిగా బయటపడింది. పాట్నా పేలుళ్లకు సంబంధించి ఇంతియాజ్ అన్సారీ, తౌసీమ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతియాజ్ పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ రాజధాని రాంచీ నివాసి అని.. ఐఎం ఇటీవలే నెలకొల్సిన ‘రాంచీ మాడ్యూల్’లో భాగస్వామి అని దర్యాప్తులో వెల్లడైనట్లు బీహార్, జార్ఖండ్ పోలీసులు తెలిపారు. అతడు పేలుళ్ల నేరాన్ని అంగీకరించాడని, కుట్ర రచన, అమలు వివరాలు వెల్లడించాడని వివరించారు. రాంచీలోని ఇంతియాజ్ నివాసంలో సోదాలు చేయగా బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు, ప్రెషర్ కుక్కర్లు, ఉగ్రవాద సాహిత్యం లభ్యమయ్యాయని రాంచీ పోలీసులు చెప్పారు. పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద సంభవించిన ఆరు పేలుళ్లు, పాట్నా రైల్వే స్టేషన్లో మరో పేలుడులో ఐదుగురు చనిపోగా, 83 మంది గాయపడిన విషయం తెలిసిందే. పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి సోమవారం చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. జార్ఖండ్ ఏడీజీ ఎస్.ఎన్.ప్రధాన్, పాట్నా ఎస్ఎస్పీ మనుమహరాజ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు వేర్వేరుగా వెల్లడించిన వివరాల ప్రకారం బాంబు పేలుళ్లు, ఐఎం ఉగ్రవాద సంస్థ పాత్ర వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతా వెళ్తున్నామంటూ పాట్నాలో పేలుళ్లు తొలి బాంబు పేలిన పాట్నా రైల్వేస్టేషన్లో ఇద్దరు కీలక నిందితులు ఇంతియాజ్, తౌసీమ్లను అరెస్ట్‌చేశారు. ఇంతియాజ్‌ను విచారించగా.. యాసిన్భత్కల్ సన్నిహితుడైన తెహసీన్అక్తర్.. పాట్నా పేలుళ్లకు కుట్రపన్ని వీరిని రంగంలోకి దింపినట్లు వెల్లడైంది. తెహసీన్ గత వారం రాంచీలో తనను కలిశాడని.. మోడీ సభ వద్ద పేలుళ్ల ప్రణాళికకు అప్పుడు తుదిరూపం ఇచ్చామని ఇంతియాజ్ బయటపెట్టాడు. తనతో పాటు గాంధీ మైదాన్ వద్దకు ఆరేడు బృందాలు బాంబులు అమర్చేందుకు వచ్చాయని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గల అతడి నివాసంలో సోదాలు నిర్వహించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇంతియాజ్, అతడి మేనల్లుడు తొఫేక్, తారిక్ అన్సారీ, నోమన్ అన్సారీలు శనివారం పాట్నా వెళ్లారని.. వారితో మార్గంలో మరో ఇద్దరు కలిశారని బయటపడింది. ఈ నలుగురూ తాము కోల్‌కతా వెళుతున్నామని స్థానికులకు చెప్పారు. కానీ శనివారం పాట్నా బయలుదేరి వెళ్లారు. వీరిలో పాట్నాలో బాంబులు అమరుస్తుండగా తారిక్ చనిపోయాడు. తౌసీమ్ ఒక బాంబుకు లోటస్ టైమర్‌ను అమరుస్తుండగా ఆ బాంబు అనుకోకుండా పేలిపోవటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి పారిపోతున్న తౌసీమ్ను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ పేలుడులో తౌసీమ్ తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి విషమంగా ఉందని, జీవించే అవకాశాలు అతి తక్కువ అని వైద్యులు చెప్తున్నారు. రైల్వే స్టేషన్లోనే ఇంతియాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. పాట్నా పేలుళ్లకు సంబంధించి ఆరుగురు అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఐఎం రాంచీ మాడ్యూల్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రాంచీ చేరుకుంది. పాట్నా పేలుళ్లకు సంబంధించి రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను విచారించి వారి ప్రమేయం లేదని నిర్ధారించుకున్న తర్వాత సోమవారం విడిచిపెట్టారు. మైదానం వద్ద మెటల్ డిటెక్టర్లు పెట్టలేదు మోడీ సభాప్రాంగణమైన గాంధీ మైదాన్‌లోకి వేలాది మంది పది ద్వారాల ద్వారా ప్రవేశించారు. అయితే వారిలో ఎవరైనా ప్రమాదకర వస్తువులు తెస్తున్నారేమో శోధించేందుకు ఎక్కడా మెటల్ డిటెక్టర్లను ఉపయోగించలేదని సమాచారం. ఇంతకుముందు బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో కూడా రాంచీ మాడ్యూల్ హస్తం ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పాట్నాలో ఆదివారం నాటి పేలుళ్లకు ఉపయోగించిన బాంబులు కూడా.. గత జూలై ఏడో తేదీన బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించన బాంబుల తరహాలోనే ఉన్నాయి. రెండు చోట్లా ఒక్కో నాటు బాంబులో అర కిలో పేలుడు పదార్థాలను ఉపయోగించారు. వాటిని పేల్చేందుకు టైమర్లను ఉపయోగించారు. రెండు చోట్లా ఉపయోగించిన టైమర్లు ఒకే బ్రాండువి. ఇవి గువాహటిలోని ఒక షాపు నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఒకే బ్రాండు టైమర్ వాచ్‌లు. రెండు చోట్ల పేలుళ్లూ ఒక్కరి పనే అనేందుకు ఇది తిరుగులేని ఆధారంగా పోలీసులు చెప్తున్నారు. భద్రతా వైఫల్యం.. రాజ్‌నాథ్ మోడీ సభవద్ద భద్రతా వైఫల్యాలు ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపిం చారు. ‘ఆ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి పాల్గొంటున్నందున.. అదనపు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. భద్రతా వైఫల్యముంది.. అందులో సందేహం లేదు’ అని అన్నారు. బీహార్ పోలీసులకు ఐబీ ముందుగానే నిర్దిష్ట హెచ్చరిక జారీచేసిందన్న అరుణ్‌జైట్లీ ఆరోపణలను పరిశీలించాల్సిందిగా అధికారులకు నిర్దేశించినట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. టూరిస్ట్ గైడ్ అవతారంలో... ‘తెహసీన్ తరచుగా గుర్తింపులను మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. సాధారణంగా టూరిస్ట్ గైడ్ అవతారంలో సంచరిస్తూ.. ఉగ్రవాద దాడులకు అనువైన ప్రాంతాల వద్ద రెక్కీ నిర్వహిస్తుంటాడు. ముఖ్యమైన పర్యాటక స్థలాలు, లేదా తాను తరచుగా వెళ్లే ఇంటర్నెట్ సెంటర్లలో కనిపించే అవకాశముంది. అలాగే.. నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు కావాలంటూ దుకాణాలకు వచ్చే అవకాశముంది’ అని ఐబీ, ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం న్యూఢిల్లీ: పాట్నా వరుస పేలుళ్ల నేపథ్యంలో.. అన్ని రాష్ట్రా లూ అప్రమత్తంగా ఉండాలని.. పండుగ సీజన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మిజోరంలలో పార్టీల సభలకు భద్రతను మరింతగా పెంచాలనీ హోంశాఖ నిర్దేశించింది. మార్కెట్లు, ఆలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. మోడీకి తగిన భద్రత కల్పిస్తున్నాం: షిండే మోడీకి తగినంత భద్రత కల్పిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పేర్కొన్నారు. పాట్నా పేలుళ్ల నేపథ్యంలో మోడీ భద్రతను సమీక్షించాలన్న బీజేపీ డిమాండ్‌కు షిండే పై విధంగా స్పందించారు. ‘అత్యున్నతమైన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ) కమెండోలతో మోడీకి 24 గంటల పాటూ జడ్ ప్లస్ భద్రత కేటాయించాం’ అని ఆయన చెప్పారు. తాను మంగళవారం పాట్నా వెళ్తానని.. మోడీ సభ వద్ద పేలుళ్లపై సమీక్షిస్తామన్నారు. -
పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల సూత్రధారిని పోలీసులు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన తెహసీన్ అక్తర్ ఈ పేలుళ్ళకు ప్రధాన సూత్రధారని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. పేలుళ్ళకు ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ వాడారు. ప్రతి బాంబులోనూ అరకేజీ పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. అటు పేలుళ్ళ మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుళ్ళ ఘటనలో గాయపడ్డ అనుమానితుడు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు సంబంధించి ముందే అప్రమత్తం చేశామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మరోవైపు నిన్న అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఇక బీహార్ పోలీసులు పేలుళ్లపై ఆరా తీస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. -
పాట్నా పేలుళ్ల నిందితుడి మృతి
బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ఆదివారం సాయంత్రం వరకు ఐదుగురు మరణించినట్టు వార్తలు రాగా.. పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు అమరుస్తున్న సమయంలో పేలుడుకు తీవ్రంగా గాయపడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి అదే రోజు రాత్రి మరణించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ పేలుళ్లో మరో 83 మంది గాయపడ్డారు. వీరిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొన్న ర్యాలీ ఆరంభానికి ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్లో ఓ బాంబు పేలగా, ర్యాలీ వేదిక గాంధీ మైదాన్ సమీపంలో మరో ఆరు బాంబులు పేలాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మరో ఆరు బాంబులను నిర్వీర్యం చేశారు. -
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ : పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌కు భద్రత పెంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పాట్నా బాంబు పేలుళ్ళ వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్లు బీహార్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహితుడైన తైసిన్ అక్తర్ ఈ పేలుళ్లకు సూత్రదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక పాట్నా పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. మరో వందమంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
పాట్నా పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. మరో వందమందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్న హూంకార్ ర్యాలీ ముందు పాట్నా వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాయపడిన వారిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం ఏడు పేలుళ్లు జరగగా, గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మరో రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. కాగా పాట్నాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సభ జరిగే రోజునే, సభ సమీపంలోనే బాంబు పేలుళ్లు జరగటం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను భగ్నంచేసేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు బీహార్ సంప్రదాయం కాదన్నారు. ఇది కావాలని చేసిన పనిగా కనిపిస్తోందన్నారు. మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తగినంత భద్రత కల్పించిందని.. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని స్పష్టంచేశారు. పేలుళ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ముందస్తుగా ఎలాంటి నిఘా సమాచారం తమకు అందలేదని చెప్పారు. -
పాట్నా పేలుళ్లలో ఐదుగురి మృతి, 50 మందికి గాయాలు
బీహార్ రాజధాని పాట్నా బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో 50 మంది గాయపడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్న హూంకార్ ర్యాలీ ముందు పాట్నా వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాయపడిన వారిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తొలుత ఒకరు చనిపోయినట్టు వార్తలు రాగా ఆ సంఖ్య ఐదుకు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. పాట్నాలో ఆదివారం ఉదయం మొత్తం ఏడు పేలుళ్లు జరిగాయి. వేదిక గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మరో రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. సహాయ కార్యక్రమాలను చేపట్టి భద్రతను పటిష్టం చేశారు. అనంతరం మోడీ ర్యాలీ ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. -
పాట్నా పేలుళ్లను ఖండించిన మన్మోహన్ సింగ్
ప్రధాని మన్మోహన్ సింగ్ బీహార్ రాజధాని పాట్నా వరస బాంబు పేలుళ్లను ఖండించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 'హూంకార్' ర్యాలీలో పాల్గొనే ముందు జరిగిన పేలుళ్లలో ఒకరు మరణించిన సంఘటనపై మన్మోమన్ స్పందించారు. ప్రజలందరూ శాంతిసామరస్యాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఫోన్ చేసి సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. పేలుళ్లపై సత్వరమే దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని ఆదేశించారు. పాట్నాలో మొత్తం ఆరు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో తొలి బాంబు పేలుడు జరుగగా, రెండో బాంబు ఓ సినిమా థియేటర్ వద్ద, మిగతా నాలుగు బాంబులు హూంకార్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం.