బీహార్ 'ప్రభుత్వ అతిథి' హోదాలోమోడీ పర్యటన
పాట్నా: గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాస్తా బీహార్ ప్రభుత్వ అతిథిగా మారనున్నారు. పాట్నా బాంబు దాడి ఘటనలో మరణించిన కుటుంబాల్ని పరామర్శించేందుకు ఆయన బీహార్ రాష్ట్రానికి అతిథి హోదాలో వెళ్లనున్నారు. రేపట్నుంచి మోడీ తలపెట్టనున్న పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాష్ట్ర అతిథి హోదాలో ప్రోటాకాల్ ఉంటుందని కేబినెట్ సమన్యయ కమిటీ ముఖ్య కార్యదర్శి బ్రజేష్ మహరోత్రా తెలిపారు. కాగా, సీఎం హోదాలో ఉన్న మోడీ రాష్ట్ర అతిథి హోదాను కల్పించడంపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారు. అతను ఆ హోదాకు పూర్తిగా అర్హుడని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు.
గత ఆదివారం పాట్నాలో మోడీ ర్యాలీకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు మోడీ శుక్రవారం పాట్నాకు చేరుకోనున్నారు. మరణించిన వారు వివిధ జిల్లాలకు చెందిన వారు కావడంతో మోడీ వారి స్వస్థలాకు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ ఘటనలో మొత్తం ఏడు పేలుళ్లు జరగగా, గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి.