అది ఇండియన్ ముజాహిదీన్ దాడే | Patna serial blasts point to Indian Mujahideen link, hand of new Ranchi module: Police | Sakshi
Sakshi News home page

అది ఇండియన్ ముజాహిదీన్ దాడే

Published Tue, Oct 29 2013 4:51 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

అది ఇండియన్ ముజాహిదీన్ దాడే - Sakshi

అది ఇండియన్ ముజాహిదీన్ దాడే

పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్  
 ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు

 
పాట్నా/రాంచి: బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ లక్ష్యంగా జరిగిన వరుస పేలుళ్లు.. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని దర్యాప్తులో వెలుగుచూసింది. ఐఎం అగ్రనేత, ఇటీవల అరెస్టయిన యాసిన్‌భత్కల్‌కు కుడిభుజంగా పేరుపడ్డ తెహసీన్ అక్తర్ (దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో పాత్రధారి) పాట్నా పేలుళ్ల సూత్రధారిగా బయటపడింది. పాట్నా పేలుళ్లకు సంబంధించి ఇంతియాజ్ అన్సారీ, తౌసీమ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతియాజ్ పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ రాజధాని రాంచీ నివాసి అని.. ఐఎం ఇటీవలే నెలకొల్సిన ‘రాంచీ మాడ్యూల్’లో భాగస్వామి అని దర్యాప్తులో వెల్లడైనట్లు బీహార్, జార్ఖండ్ పోలీసులు తెలిపారు. అతడు పేలుళ్ల నేరాన్ని అంగీకరించాడని, కుట్ర రచన, అమలు వివరాలు వెల్లడించాడని వివరించారు.
 
 రాంచీలోని ఇంతియాజ్ నివాసంలో సోదాలు చేయగా బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు, ప్రెషర్ కుక్కర్లు, ఉగ్రవాద సాహిత్యం లభ్యమయ్యాయని రాంచీ పోలీసులు చెప్పారు. పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద సంభవించిన ఆరు పేలుళ్లు, పాట్నా రైల్వే స్టేషన్‌లో మరో పేలుడులో ఐదుగురు చనిపోగా, 83 మంది గాయపడిన విషయం తెలిసిందే. పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి సోమవారం చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. జార్ఖండ్ ఏడీజీ ఎస్.ఎన్.ప్రధాన్, పాట్నా ఎస్‌ఎస్‌పీ మనుమహరాజ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు వేర్వేరుగా వెల్లడించిన వివరాల ప్రకారం బాంబు పేలుళ్లు, ఐఎం ఉగ్రవాద సంస్థ పాత్ర వివరాలు ఇలా ఉన్నాయి.
 
కోల్‌కతా వెళ్తున్నామంటూ పాట్నాలో పేలుళ్లు
 తొలి బాంబు పేలిన పాట్నా రైల్వేస్టేషన్‌లో ఇద్దరు కీలక నిందితులు ఇంతియాజ్, తౌసీమ్‌లను అరెస్ట్‌చేశారు. ఇంతియాజ్‌ను విచారించగా.. యాసిన్‌భత్కల్ సన్నిహితుడైన తెహసీన్‌అక్తర్.. పాట్నా పేలుళ్లకు కుట్రపన్ని వీరిని రంగంలోకి దింపినట్లు వెల్లడైంది. తెహసీన్ గత వారం రాంచీలో తనను కలిశాడని.. మోడీ సభ వద్ద పేలుళ్ల ప్రణాళికకు అప్పుడు తుదిరూపం ఇచ్చామని ఇంతియాజ్ బయటపెట్టాడు. తనతో పాటు గాంధీ మైదాన్ వద్దకు ఆరేడు బృందాలు బాంబులు అమర్చేందుకు వచ్చాయని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గల అతడి నివాసంలో సోదాలు నిర్వహించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇంతియాజ్, అతడి మేనల్లుడు తొఫేక్, తారిక్ అన్సారీ, నోమన్ అన్సారీలు శనివారం పాట్నా వెళ్లారని.. వారితో మార్గంలో మరో ఇద్దరు కలిశారని బయటపడింది.
 
 ఈ నలుగురూ తాము కోల్‌కతా వెళుతున్నామని స్థానికులకు చెప్పారు. కానీ శనివారం పాట్నా బయలుదేరి వెళ్లారు. వీరిలో పాట్నాలో బాంబులు అమరుస్తుండగా తారిక్ చనిపోయాడు. తౌసీమ్ ఒక బాంబుకు లోటస్ టైమర్‌ను అమరుస్తుండగా ఆ బాంబు అనుకోకుండా పేలిపోవటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి పారిపోతున్న తౌసీమ్‌ను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ పేలుడులో తౌసీమ్ తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి విషమంగా ఉందని, జీవించే అవకాశాలు అతి తక్కువ అని వైద్యులు చెప్తున్నారు. రైల్వే స్టేషన్‌లోనే ఇంతియాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. పాట్నా పేలుళ్లకు సంబంధించి ఆరుగురు అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఐఎం రాంచీ మాడ్యూల్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఐఏ బృందం రాంచీ చేరుకుంది. పాట్నా పేలుళ్లకు సంబంధించి రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను విచారించి వారి ప్రమేయం లేదని నిర్ధారించుకున్న తర్వాత సోమవారం విడిచిపెట్టారు.
 
 మైదానం వద్ద మెటల్ డిటెక్టర్లు పెట్టలేదు
 మోడీ సభాప్రాంగణమైన గాంధీ మైదాన్‌లోకి వేలాది మంది పది ద్వారాల ద్వారా ప్రవేశించారు. అయితే వారిలో ఎవరైనా ప్రమాదకర వస్తువులు తెస్తున్నారేమో శోధించేందుకు ఎక్కడా మెటల్ డిటెక్టర్లను ఉపయోగించలేదని సమాచారం. ఇంతకుముందు బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో కూడా రాంచీ మాడ్యూల్ హస్తం ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పాట్నాలో ఆదివారం నాటి పేలుళ్లకు ఉపయోగించిన బాంబులు కూడా.. గత జూలై ఏడో తేదీన బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించన బాంబుల తరహాలోనే ఉన్నాయి. రెండు చోట్లా ఒక్కో నాటు బాంబులో అర కిలో పేలుడు పదార్థాలను ఉపయోగించారు. వాటిని పేల్చేందుకు టైమర్లను ఉపయోగించారు. రెండు చోట్లా ఉపయోగించిన టైమర్లు ఒకే బ్రాండువి. ఇవి గువాహటిలోని ఒక షాపు నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఒకే బ్రాండు టైమర్ వాచ్‌లు. రెండు చోట్ల పేలుళ్లూ ఒక్కరి పనే అనేందుకు ఇది తిరుగులేని ఆధారంగా పోలీసులు చెప్తున్నారు.
 
భద్రతా వైఫల్యం.. రాజ్‌నాథ్
మోడీ సభవద్ద భద్రతా వైఫల్యాలు ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపిం చారు. ‘ఆ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి పాల్గొంటున్నందున.. అదనపు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. భద్రతా వైఫల్యముంది.. అందులో సందేహం లేదు’ అని అన్నారు. బీహార్ పోలీసులకు ఐబీ ముందుగానే నిర్దిష్ట హెచ్చరిక జారీచేసిందన్న అరుణ్‌జైట్లీ ఆరోపణలను పరిశీలించాల్సిందిగా అధికారులకు నిర్దేశించినట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.  
 
 టూరిస్ట్ గైడ్ అవతారంలో...
 ‘తెహసీన్ తరచుగా గుర్తింపులను మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. సాధారణంగా టూరిస్ట్ గైడ్ అవతారంలో సంచరిస్తూ.. ఉగ్రవాద దాడులకు అనువైన ప్రాంతాల వద్ద రెక్కీ నిర్వహిస్తుంటాడు. ముఖ్యమైన పర్యాటక స్థలాలు, లేదా తాను తరచుగా వెళ్లే ఇంటర్నెట్ సెంటర్లలో కనిపించే అవకాశముంది. అలాగే.. నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు కావాలంటూ దుకాణాలకు వచ్చే అవకాశముంది’ అని ఐబీ, ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
 
 అప్రమత్తంగా ఉండండి: కేంద్రం
 న్యూఢిల్లీ: పాట్నా వరుస పేలుళ్ల నేపథ్యంలో.. అన్ని రాష్ట్రా లూ అప్రమత్తంగా ఉండాలని.. పండుగ సీజన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మిజోరంలలో పార్టీల సభలకు భద్రతను మరింతగా పెంచాలనీ హోంశాఖ నిర్దేశించింది. మార్కెట్లు, ఆలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
 
 మోడీకి తగిన భద్రత కల్పిస్తున్నాం: షిండే
 మోడీకి తగినంత భద్రత కల్పిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పేర్కొన్నారు. పాట్నా పేలుళ్ల నేపథ్యంలో మోడీ భద్రతను సమీక్షించాలన్న బీజేపీ డిమాండ్‌కు షిండే పై విధంగా స్పందించారు. ‘అత్యున్నతమైన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్‌ఎస్‌జీ) కమెండోలతో మోడీకి 24 గంటల పాటూ జడ్ ప్లస్ భద్రత కేటాయించాం’ అని ఆయన చెప్పారు. తాను మంగళవారం పాట్నా వెళ్తానని.. మోడీ సభ వద్ద పేలుళ్లపై సమీక్షిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement