సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో పాత్రధారిగా ఉన్న తెహసీన్ అక్తర్.. అక్టోబర్ 27 నాటికి పాట్నా పేలుళ్లలో సూత్రధారిగా మారాడు! ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ వాసిమ్ అక్తర్ షేక్ అలియాస్ మోను అలియాస్ హసన్ (23) స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఉన్న మనియార్‌పూర్ గ్రామం. కంప్యూటర్ విద్యను అభ్యసించిన మోను గతంలో నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)లో కీలకపాత్ర పోషించాడు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ ద్వారా ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడు.
అతడి ఆదేశాల మేరకే అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (గత ఆగస్టులో యాసీన్ భత్కల్‌తో పాటు బీహార్‌లో అరెస్టయిన ఉగ్రవాది)తో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు రంగంలోకి దిగాడు. హడ్డీ, వఖాస్‌లతో కలిసి నగరంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫిబ్రవరి 21న సైకిల్‌పై పెట్టుకున్న బాంబును ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద వదిలి వెళ్లాడు. 2011లో ముంబై వరుస పేలుళ్లు, వారణాసి పేలుళ్ల కేసులో కూడా తెహసీన్ నిందితుడు. ఆయా కేసులకు సంబంధించి ఎన్‌ఐఏ గత కొన్ని నెలల్లో పదిసార్లకు పైగా అతడి స్వగ్రామంలో గాలింపు చేపట్టింది. అతడిపై అరెస్ట్ వారంట్ జారీచేసిన ఎన్‌ఐఏ.. ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల బహుమతి కూడా ప్రకటించింది. అయినా ఫలితం దక్కలేదు.
దిల్‌సుఖ్‌నగర్ పాత్రధారే పాట్నా సూత్రధారి
Published Tue, Oct 29 2013 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement