ప్రతీకారేచ్ఛతోనే పేలుళ్లు | Riyaz Bhatkal Planned Serial Blasts In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 1:50 AM | Last Updated on Wed, Sep 5 2018 1:58 AM

Riyaz Bhatkal Planned Serial Blasts In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజధానిలో జంట బాంబు పేలుళ్లవెనుక ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదుల ప్రతీకారేచ్ఛే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చారు. హైదరాబాద్‌ పాతబస్తీ లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడుకు ఓ వర్గం వారే బాధ్యులని భావించిన ఐఎం ఉగ్రవాదులు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించారు. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్‌ సమీపంలో ఉన్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో మరో బాంబును అమర్చినా అది పేలకపోవ డంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న అశోక్‌ మీవ్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందని నిందితులు బయటపెట్టారు.

భారీ ప్రాణ నష్టమే లక్ష్యం...
హుస్సేన్‌సాగర్‌ బోట్‌లో అనీఖ్, గోకుల్‌చాట్‌లో రియాజ్, దిల్‌సుఖ్‌నగర్‌లో అక్బర్‌ బాంబులు పేట్టాలన్నది పథకం. వాస్తవానికి సికింద్రాబాద్, అమీర్‌పేట్, చార్మినార్‌ సహా మరికొన్ని చోట్ల రెక్కీ చేసినా చివరకు రియాజ్‌ ఆదేశాలతో ఈ మూడింటినే టార్గెట్‌గా చేసుకున్నారు. భారీ ప్రాణ నష్టాన్ని సృష్టించాలని భావించిన రియాజ్‌ భత్కల్‌... నగరంలో మూడు బాంబులూ రద్దీ సమయమైన రాత్రి 7 గంటలకు కచ్చితంగా పేలేలా అనీఖ్, అక్బర్‌ల వాచీలను రీ–సెట్‌ చేయించాడు. టైమర్‌తో కూడిన షేప్డ్‌ బాంబుల్లో సరిగ్గా 6.45 గంటలకు బ్యాటరీలను పెట్టి, తమ టార్గెట్స్‌లో జన సమ్మర్థం ఉన్న చోట వదలాలని స్పష్టం చేశాడు. తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్లను ఫ్లాట్‌ నుంచి బయటకు వెళ్లే ముందు ఆపేయాలని, విధ్వంసం జరిగి ఫ్లాట్‌కు చేరుకున్నాకే వాటిని ఆన్‌చేయాలని చెప్పాడు. ఒకవేళ ముగ్గురిలో ఎవరైనా పట్టుబడితే పోలీసుల సమక్షంలోనే మిగిలిన ఇద్దరికీ ఫోన్‌ చేసి ‘బిగ్‌ బజార్‌కు రండి’అని చెప్పాలంటూ రియాజ్‌ కోడ్‌ ఏర్పాటు చేశాడు. ఇలా ఫోన్‌ వస్తే మిగిలిన వారు పారిపోవాలని స్పష్టం చేశాడు.

తారుమారైన పరిస్థితులు...
గోకుల్‌చాట్‌ వద్ద పేలుడుకు రియాజ్‌ భత్కల్‌ పథకం ప్రకారమే అక్కడి ఐస్‌క్రీమ్‌ డబ్బాపై బాంబు పెట్టి జారుకున్నా మిగిలిన ఇద్దరు మాత్రం పేలుళ్ల అమల్లో కంగారుపడ్డారు. హబ్సిగూడ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రా బాద్‌కు వెళ్లిన అనీఖ్‌ అక్కడి నుంచి ఆటోలో లుంబినీ పార్కుకు చేరుకొని ఆటోడ్రైవర్‌కు రూ. 500 నోటు ఇవ్వగా అతడు చిల్లర లేదన్నాడు. దీంతో అక్కడే ఉన్న లేజర్‌ షో బుకింగ్‌ కౌంటర్‌లో టికెట్‌ కొని చిల్లర తెచ్చిచ్చాడు. కానీ ఆటో దిగే ముందే టైమర్‌ను ఆన్‌ చేయడంతో బాంబు యాక్టివేట్‌ అయి పోయింది. అయితే అప్పుడే షికారు బోటు హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లిపోవడం, మరొకటి బయలుదేరే వరకు తాను వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండటం, ఈలోగా బాంబు పేలే ప్రమాదం నెలకొనడంతో తాను కొన్న టికెట్‌తో లేజర్‌ షో వద్దకు వెళ్లి బాంబు అమర్చి పరారయ్యాడు.

మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో బాంబు పెట్టడానికి హబ్సిగూడలోని ఫ్లాట్‌ నుంచి సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరిన అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి బస్సు కోసం నిరీక్షించి అది రాకపోవడంతో ఆటోలో 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా జన సమ్మర్థంగా ఉన్నప్పటికీ బాంబు ఉన్న బ్యాగ్‌ను ఎక్కడ పెట్టాలో అతనికి అర్థంకాలేదు. ఆ ఆందోళనలోనే బాంబులో బ్యాటరీని హడావుడిగా పెట్టడంతో టైమర్‌ వాచ్‌ పని చేయకపోవడాన్ని గమనించినా... ఏమీ చేయలేక బ్యాగ్‌ను ఓ ద్విచక్ర వాహనానికి తగిలించి చివరకు ఫ్లాట్‌కు చేరుకున్నాడు. పేలుడు జరిగిన మర్నాడూ ముగ్గురు ఉగ్రవాదులు ఫ్లాట్‌లోనే గడిపారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 3.30 గంటలకు అక్బర్‌ సికింద్రాబాద్‌ నుంచి బస్సు ద్వారా పుణే పరారవగా ఆపై రెండు రోజుల వ్యవధిలో మిగిలిన వాళ్లూ పరారయ్యారు. ఈ విధ్వంసాలకు అవసరమైన సహాయ సహకారాలను ఇతర నిందితులు అందించారు.

రియాజ్‌ భత్కల్‌ స్కెచ్‌...
ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌ తన సోదరుడు ఇక్బాల్‌ భత్కల్, పాకిస్తాన్‌లో ఉన్న అమీర్‌ రజా ఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్‌ వేశాడు. రియాజ్‌ ఆదేశాలతో 2007 ఆగస్టు మొదటి వారంలో అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్‌ నగరానికి చేరుకోగా సురక్షిత ప్రాం తంలో ఇల్లు అద్దెకు తీసుకోవడంతోపాటు కం ప్యూటర్‌ కోర్సులో చేరాలంటూ అతన్ని రియా జ్‌ ఆదేశించాడు. దీంతో అనీఖ్‌ తొలుత సరూర్‌ నగర్‌లో ఉంటున్న ఫారూఖ్‌ బంధు వైన నవీద్‌ వద్ద ఆశ్రయం పొందాడు. ఆపై నాంపల్లిలోని అజీజియా లాడ్జిలో కొన్ని రోజులు బస చేశాడు. ఆ తర్వా త హబ్సిగూడలోని బంజారా నిల యం అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నంబర్‌ 302ను అద్దెకు తీసుకున్నాడు.

అనీఖ్‌ ఎవరికీ అనుమానం రాకుండా నగరంలో ఆశ్రయం పొందడంతో పుణేకు చెందిన అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిని రియాజ్‌ హైద రాబాద్‌ పంపాడు. వారిద్దరూ అమీ ర్‌పేటలోని ధూమ్‌ కంప్యూటర్స్‌ లో హార్డ్‌వేర్‌ శిక్షణలో చేరారు. పే లుళ్లకు కొన్ని రోజుల ముందు సిటీ వచ్చిన రియాజ్‌... ఇక్కడి ఏర్పాట్ల పై సంతృప్తి చెందాడు. కొన్ని రోజు ల తర్వాత మంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సు లో పేలుడు పదార్థాలను పంపగా... అనీఖ్, అక్బర్‌ ఎంజీబీఎస్‌లో వాటిని అందుకున్నారు. పేలుళ్లకు రెండ్రోజుల ముందు అనీఖ్, అక్బర్‌లను నగరంలో కలిసిన రియాజ్‌ కుట్ర అమలుకు సిద్ధం కావాలని ఆదేశించాడు. దీంతో వారిద్దరూ సికింద్రాబాద్‌లో బ్యాగ్‌లు, కోఠిలో బ్యాటరీలు కొని అనుకున్నట్లుగానే 2007 ఆగస్టు 25న మూడు బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని బయలుదేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement