
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లలో సంభవించిన జంట పేలుళ్ల కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాల్ చేస్తూ దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వీరిద్దరికీ ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన నేరానికి తారీఖ్ అంజూమ్ ఎహసాన్ అనే వ్యక్తికి కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తారీఖ్ కూడా హైకోర్టులో అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
వీటిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన నిందితులు షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్‌లకు పేలుళ్లతో సంబంధం ఉందని, కింది కోర్టు వీరిని విడిచిపెట్టడం చెల్లదని ప్రత్యేక దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పీల్ తీర్పు వెలువడే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వారి అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఉరిశిక్ష ఖరారు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వాటికి గతంలోనే హైకోర్టు నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయిల్ మొదలు పెట్టింది. అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment