సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట బాంబుపేలుళ్ల కేసులో మరో నిందితుడిని సైతం కోర్టు దోషిగా తేల్చింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌ను సైతం కోర్టు దోషిగా తేల్చింది. అతను ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చాడని విచారణలో రుజువైంది. తారీఖ్ అంజూమ్‌తో పాటు దోషులు ఇస్మాయిల్ చురి, అనీఖ్ షఫీఖ్‌లకు కోర్టు మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది.
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment