indian mujahiddin
-
జైల్లో ఉగ్రవాది.. ఆ వైద్యుడే కావాలంటూ హల్చల్
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడి, ప్రస్తుతం ఢిల్లీ చాణక్యపురిలోని తీహార్ జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది, ఆ సంస్థ కో–ఫౌండర్ యాసీన్ భత్కల్ జైలు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.ఇటీవల తాను అలోపతి వైద్యం చేయించుకోనని, ఆయుర్వేద డాక్టర్ కావాలంటూ పట్టుపట్టాడు. ఎట్టకేలకు జైలు అధికారుల నుంచి సోమవారం అనుమతి కూడా పొందాడు. ►కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ మగ్దూంకాలనీకి చెందిన యాసీన్ భత్కల్ అసలు పేరు మహ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్ భత్కల్‌కు వరుసకు సోదరుడు. ►ఇంజినీరింగ్ విద్యనభ్యసించడానికి అంటూ పుణేకు వలసవెళ్లాడు. అక్కడ ఉండగానే యునానీ మెడిసిన్ ప్రాక్టీషనర్‌గా ఉన్న సోదరుడైన ఇక్బాల్ భత్కల్‌కు సన్నిహితంగా మారి ఉగ్రవాదం వైపు మళ్లాడు. ►2007 నుంచి ఐఎంలో కీలకపాత్ర పోషించిన యాసీన్ ఆ తర్వాతి ఏడాది నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2008లో ఐఎం కో–ఫౌండర్‌గా బాధ్యతలు స్వీకరించిన యాసీన్ అనేక విధ్వంసాలకు వ్యూహరచన చేశాడు. ►అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా.. 2010 ఫిబ్రవరి 13న జరిగిన పుణేలోని జర్మన్ బేకరీ బ్లాస్ట్‌తో మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. దిల్సుఖ్నగర్ ట్విన్ బ్లాస్ట్ సహా 2008 నుంచి 2013 వరకు అనేక పేలుళ్లకు పాల్పడ్డాడు. ►2013 ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఏ1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ వద్ద జరిగిన పేలుళ్లతో ఇతడి కోసం వేట ముమ్మరమైంది. నేపాల్‌లోని పోఖారాలో యునానీ వైద్యుడిగా నివసిస్తున్న యాసీన్‌ను 2013 ఆగస్టు 28న పట్టుకున్నారు. ►దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు విచారణ 2016 డిసెంబర్లో పూర్తయింది. ఈ కేసులో ఇతడితో సహా ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన కేసుల విచారణ కోసం యాసీన్‌ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ►అక్కడి జైలు నెం.2లో ఉంటున్న ఈ ఉగ్రవాదికి ఇటీవల కీళ్ల నొప్పులు వచ్చాయి. దీంతో జైలు ఆవరణలో ఉన్న ఆసుపత్రి డాక్టర్‌కు చూపించి వైద్యం చేయించాలని అధికారులు ప్రయత్నించారు. ►తాను అలోపతి వైద్యం చేయించుకోనంటూ పట్టుబట్టాడు. ఆయుర్వేద వైద్యంపై నమ్మకం ఉందని, ఆ వైద్యుడినే పిలిపించాలని హల్చల్ చేశాడు. దీంతో జైలు అధికారులు ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్‌కు విషయం చెప్పారు. ►స్పందించిన ఆయన యాసీన్‌కు ఆయుర్వేద వైద్యుడితో చికిత్స చేయించడానికి సోమవారం అంగీకరించారు. ఈ వైద్యం కోసం త్వరలో ఓ అధీకృత ఆయుర్వేద వైద్యుడిని తీహార్ జైలుకు పిలిపించనున్నారు. చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో.. -
జంట పేలుళ్ల కేసు.. మరో నిందితుడు దోషే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట బాంబుపేలుళ్ల కేసులో మరో నిందితుడిని సైతం కోర్టు దోషిగా తేల్చింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌ను సైతం కోర్టు దోషిగా తేల్చింది. అతను ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చాడని విచారణలో రుజువైంది. తారీఖ్ అంజూమ్‌తో పాటు దోషులు ఇస్మాయిల్ చురి, అనీఖ్ షఫీఖ్‌లకు కోర్టు మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. చదవండి: ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు -
లుంబీనీ పేలుళ్ల కేసు.. అనూహ్య తీర్పు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. దోషులపై సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. రెండో కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఇక దోషులకు విధించే శిక్ష ఆ రోజే తెలియనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. -
బ్రేకింగ్: జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నేడు (సోమవారం) తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట ఐదుగురు నిందితులను హాజరుపర్చారు. భద్రత కారణాల వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం లేదని, జైలు నుంచే వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెడతామని జైలు అధికారులు తెలిపారు. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబులకు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండటంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. జంట పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికారులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
నాకు అసలే సిగ్గు బాబు!
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు... దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరు విధ్వంసాలకు సూత్రధారి... దేశ వ్యాప్తంగా 149 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది... గతేడాది ఉరి శిక్ష కూడా పడిన యాసీన్ భత్కల్‌కు కెమెరాను ఫేస్ చేయాలంటే సిగ్గట. ఈ విషయాన్ని అతడే ఢిల్లీ న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. తనకు కెమెరా షై ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే ప్రక్రియను ఆపాలని కోరాడు. ఈ మేరకు గత వారం ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే నిఘా వర్గాలు మాత్రం కేసు విచారణ జాప్యం జరిగేలా చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడని అంటున్నారు. తీహార్ జైలు ‘ఏకాంత కారాగారం’లో కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013, ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో దిల్సుఖ్నగర్ కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్‌ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. ఇక్కడే ఈ ఉగ్రవాదికి ‘సిగ్గు పుట్టుకు’వచ్చింది. జాప్యం చేయడానికే... కేసు విచారణకు అడ్డంకులు సృష్టించి జాప్యం జరిగేలా చేయడానికే యాసీన్ పిటిషన్ దాఖలు చేశాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ పూర్తయితే ఇప్పటికే పడిన ఉరి శిక్ష అమలు చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం కోసమే యాసీన్ పిటిషన్ దాఖలు చేసినట్లు అంచనా వేస్తున్నాయి. కాగా భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని అధికారులు చెప్తున్నారు. గతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ తీసుకువెళ్లడానికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన హెలీకాఫ్టర్ వాడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. యాసీన్ పిటిషన్ ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కెమెరా షై అంటూ పిటిషన్... కొన్నాళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు కోర్టు విచారణ ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్ గత సోమవారం ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. కెమెరా షై ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ పేర్కొన్నాడు. కేసుకు సంబం«ధించిన చర్చలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన లాయర్లను బెంగళూరు నుంచి తీహార్ జైలు వరకు రప్పించడానికి భారీగా ఖర్చు అవుతోందని పిటిషన్లో పేర్కొన్నాడు. స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ముంబై దాడులకు (26/11 ఎటాక్స్) కీలక పాత్రధారిగా ఉండి, సజీవంగా పట్టుబడిన పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు విచారణ నేపథ్యంలో ఇచ్చిన వెసులుబాట్లలో కొన్ని తనకూ వర్తింపజేయాలని యాసీన్ విన్నవించుకున్నాడు. -
సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు
గుజరాత్: గుజరాత్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీంతో ఆలయానికి భద్రతను పెంచటంతో పాటు హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో గుజరాతీ భాషలో రాసిన ఓ లేఖ వడోదరా నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఇక బాంబు స్క్వాడ్ బృందం ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకూ ఆలయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సెక్యూరిటీ ఏజెన్సీ విచారణ చేపట్టింది. కాగా సోమనాథ్ ఆలయం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది. -
పేలుళ్ల కేసు నిందితుడి అభ్యర్థన తిరస్కరణ
న్యూఢిల్లీ: తన కేసు విచారణను మరో కోర్టుకు మార్చడాన్ని సవాల్ చేస్తూ 2008 వరుస పేలుళ్ల కేసు నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ కేసులో నిందితులైన 13 మంది అనుమానిత ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యుల్లో పిటిషనర్ మహ్మద్ షకీల్ కూడా ఒకరు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కేసు విచారణను తీస్ హజారీ కోర్టునుంచి పటియాలాహౌస్ కోర్టుకు మార్చుతూ ఆగస్టు మూడు జారీ అయిన ఆదేశాలను రద్దు చేయాలని షకీల్ అభ్యర్థించాడు. ఇలాంటి అభ్యర్థనలను అంగీకరించడం న్యాయవ్యవస్థకు హాని చేయగలదని న్యాయమూర్తి రవీంద్రభట్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. ఇది వరకే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన న్యాయమూర్తి మాత్రమే ఈ కేసు విచారణను కొనసాగించాలని ఆదేశించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుత పిటిషన్‌ను ఆమోదిస్తే భవిష్యత్‌లో ఇలాంటి అభ్యర్థనలు పెరుగుతాయని, ఫలితంగా న్యాయవ్యవస్థపై మరింత భారం పడుతుందని బెంచ్ అభిప్రాయపడింది. తీస్‌హజారీ కోర్టులో ఇది వరకే 197 మంది వాంగ్మూలాను స్వీకరించిందని, ఇప్పుడు కేసు విచారణను బదిలీ చేస్తే చాలా జాప్యం జరుగుతుందని షకీల్ వాదించాడు. -
యాసిన్‌కు నిధులెలా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 40 వరకూ బాంబు పేలుళ్లు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు పాకిస్థాన్ నుంచి నిధులు ఏ మార్గంలో అందాయనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరా తీస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ పాకిస్థాన్ నుంచే నిధులు అందినట్లు ఎన్ఐఏ విచారణలో యాసిన్ అంగీకరించాడు. దీంతో హవాలా మార్గంలో వచ్చాయా, నకిలీనోట్ల ముఠాల ద్వారానా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు ఒక్కో హవాలా ఏజెంట్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ నుంచి డబ్బును పంపేవిధానం రెండేళ్లవరకూ కొనసాగింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా తీవ్రం కావడంతో ఇటీవలి కాలంలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఎన్ ఐఏ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో ముద్రించే నకిలీ నోట్లను ఉగ్రవాద మాడ్యూల్స్ ద్వారానే నేపాల్ మీదుగా పెద్దమొత్తంలో భారతదేశంలోకి తరలిస్తున్నారు. దీంతో ఈ ముఠాల ద్వారానే దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు పంపే ఎత్తుగడ వేశారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, మరోవైపు శాంతిభద్రతల సమస్య సృష్టించి హైదరాబాద్ వంటి నగరాలకు పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఇదేవిషయాన్ని యాసిన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. గత ఏడాది కాలంగా ఐఎం కీలక నేతలు రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ మాడ్యూల్ల ద్వారా కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. యాసిన్ మాడ్యూల్లో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు నకిలీనోట్ల చలామణి ముఠాల నుంచి మారకం రూపంలో సేకరించిన డబ్బునే దిల్సుఖ్నగర్ పేలుళ్ల కోసం అప్పగించినట్లు సమాచారం. ఈ పేలుళ్ల కోసమే రూ.10 లక్షల వరకూ ఖర్చుచేసినట్లు కూడా బయటపడింది. ఇలావుండగా 2011లో ముంబైలో జరిగిన మూడు వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి యాసిన్‌ను, అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా అక్కడి మోకా కోర్టు సోమవారం బదిలీ వారంట్ జారీ చేసింది. -
భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు