జైల్లో ఉగ్రవాది.. ఆ వైద్యుడే కావాలంటూ హల్‌చల్‌ | Im Terrorist Yasin Bhatkal Need Ayurvedic Doctor For Treatment In Tihar Jail | Sakshi
Sakshi News home page

జైల్లో ఉగ్రవాది.. ఆ వైద్యుడే కావాలంటూ హల్‌చల్‌

Published Wed, Sep 15 2021 9:24 PM | Last Updated on Wed, Sep 15 2021 9:31 PM

Im Terrorist Yasin Bhatkal Need Ayurvedic Doctor For Treatment In Tihar Jail - Sakshi

యాసీన్‌ భత్కల్‌(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడి, ప్రస్తుతం ఢిల్లీ చాణక్యపురిలోని తీహార్‌ జైల్లో ఉన్న ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాది, ఆ సంస్థ కో–ఫౌండర్‌ యాసీన్‌ భత్కల్‌ జైలు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.ఇటీవల తాను అలోపతి వైద్యం చేయించుకోనని, ఆయుర్వేద డాక్టర్‌ కావాలంటూ పట్టుపట్టాడు. ఎట్టకేలకు జైలు అధికారుల నుంచి సోమవారం అనుమతి కూడా పొందాడు.   

►కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్‌ మగ్దూంకాలనీకి చెందిన యాసీన్‌ భత్కల్‌ అసలు పేరు మహ్మద్‌ అహ్మద్‌ జరార్‌ సిద్ధిబప్ప. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌ భత్కల్‌కు వరుసకు సోదరుడు.  
►ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించడానికి అంటూ పుణేకు వలసవెళ్లాడు. అక్కడ ఉండగానే యునానీ మెడిసిన్‌ ప్రాక్టీషనర్‌గా ఉన్న సోదరుడైన ఇక్బాల్‌ భత్కల్‌కు సన్నిహితంగా మారి ఉగ్రవాదం వైపు మళ్లాడు.  
►2007 నుంచి ఐఎంలో కీలకపాత్ర పోషించిన యాసీన్‌ ఆ తర్వాతి ఏడాది నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2008లో ఐఎం కో–ఫౌండర్‌గా బాధ్యతలు స్వీకరించిన యాసీన్‌ అనేక విధ్వంసాలకు వ్యూహరచన చేశాడు.  

►అహ్మదాబాద్‌ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా.. 2010 ఫిబ్రవరి 13న జరిగిన పుణేలోని జర్మన్‌ బేకరీ బ్లాస్ట్‌తో మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు. దిల్‌సుఖ్‌నగర్‌ ట్విన్‌ బ్లాస్ట్‌ సహా 2008 నుంచి 2013 వరకు అనేక పేలుళ్లకు పాల్పడ్డాడు. 
►2013 ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఏ1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ వద్ద జరిగిన పేలుళ్లతో ఇతడి కోసం వేట ముమ్మరమైంది. నేపాల్‌లోని పోఖారాలో యునానీ వైద్యుడిగా నివసిస్తున్న యాసీన్‌ను 2013 ఆగస్టు 28న పట్టుకున్నారు.  
►దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు విచారణ 2016 డిసెంబర్‌లో పూర్తయింది. ఈ కేసులో ఇతడితో సహా ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన కేసుల విచారణ కోసం యాసీన్‌ను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించారు.  
►అక్కడి జైలు నెం.2లో ఉంటున్న ఈ ఉగ్రవాదికి ఇటీవల కీళ్ల నొప్పులు వచ్చాయి. దీంతో జైలు ఆవరణలో ఉన్న ఆసుపత్రి డాక్టర్‌కు చూపించి వైద్యం చేయించాలని అధికారులు ప్రయత్నించారు.  

►తాను అలోపతి వైద్యం చేయించుకోనంటూ పట్టుబట్టాడు. ఆయుర్వేద వైద్యంపై నమ్మకం ఉందని, ఆ వైద్యుడినే పిలిపించాలని హల్‌చల్‌ చేశాడు. దీంతో జైలు అధికారులు ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సందీప్‌ గోయల్‌కు విషయం చెప్పారు.  
►స్పందించిన ఆయన యాసీన్‌కు ఆయుర్వేద వైద్యుడితో చికిత్స చేయించడానికి సోమవారం అంగీకరించారు. ఈ వైద్యం కోసం త్వరలో ఓ అధీకృత ఆయుర్వేద వైద్యుడిని తీహార్‌ జైలుకు పిలిపించనున్నారు. 

చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement