తన కేసు విచారణను మరో కోర్టుకు మార్చడాన్ని సవాల్ చేస్తూ 2008 వరుస పేలుళ్ల కేసు నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: తన కేసు విచారణను మరో కోర్టుకు మార్చడాన్ని సవాల్ చేస్తూ 2008 వరుస పేలుళ్ల కేసు నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ కేసులో నిందితులైన 13 మంది అనుమానిత ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యుల్లో పిటిషనర్ మహ్మద్ షకీల్ కూడా ఒకరు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కేసు విచారణను తీస్ హజారీ కోర్టునుంచి పటియాలాహౌస్ కోర్టుకు మార్చుతూ ఆగస్టు మూడు జారీ అయిన ఆదేశాలను రద్దు చేయాలని షకీల్ అభ్యర్థించాడు. ఇలాంటి అభ్యర్థనలను అంగీకరించడం న్యాయవ్యవస్థకు హాని చేయగలదని న్యాయమూర్తి రవీంద్రభట్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.
ఇది వరకే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన న్యాయమూర్తి మాత్రమే ఈ కేసు విచారణను కొనసాగించాలని ఆదేశించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుత పిటిషన్‌ను ఆమోదిస్తే భవిష్యత్‌లో ఇలాంటి అభ్యర్థనలు పెరుగుతాయని, ఫలితంగా న్యాయవ్యవస్థపై మరింత భారం పడుతుందని బెంచ్ అభిప్రాయపడింది. తీస్‌హజారీ కోర్టులో ఇది వరకే 197 మంది వాంగ్మూలాను స్వీకరించిందని, ఇప్పుడు కేసు విచారణను బదిలీ చేస్తే చాలా జాప్యం జరుగుతుందని షకీల్ వాదించాడు.