యాసిన్‌కు నిధులెలా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 40 వరకూ బాంబు పేలుళ్లు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు పాకిస్థాన్ నుంచి నిధులు ఏ మార్గంలో అందాయనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆరా తీస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ పాకిస్థాన్ నుంచే నిధులు అందినట్లు ఎన్‌ఐఏ విచారణలో యాసిన్ అంగీకరించాడు. దీంతో హవాలా మార్గంలో వచ్చాయా, నకిలీనోట్ల ముఠాల ద్వారానా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు.
ఒక్కో ఆపరేషన్‌కు ఒక్కో హవాలా ఏజెంట్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ నుంచి డబ్బును పంపేవిధానం రెండేళ్లవరకూ కొనసాగింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా తీవ్రం కావడంతో ఇటీవలి కాలంలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఎన్ ఐఏ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. పాకిస్థాన్ ఐఎస్‌ఐ సహకారంతో ముద్రించే నకిలీ నోట్లను ఉగ్రవాద మాడ్యూల్స్ ద్వారానే నేపాల్ మీదుగా పెద్దమొత్తంలో భారతదేశంలోకి తరలిస్తున్నారు. దీంతో ఈ ముఠాల ద్వారానే దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు పంపే ఎత్తుగడ వేశారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, మరోవైపు శాంతిభద్రతల సమస్య సృష్టించి హైదరాబాద్ వంటి నగరాలకు పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఇదేవిషయాన్ని యాసిన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
గత ఏడాది కాలంగా ఐఎం కీలక నేతలు రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ మాడ్యూల్‌ల ద్వారా కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. యాసిన్ మాడ్యూల్‌లో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు నకిలీనోట్ల చలామణి ముఠాల నుంచి మారకం రూపంలో సేకరించిన డబ్బునే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కోసం అప్పగించినట్లు సమాచారం. ఈ పేలుళ్ల కోసమే రూ.10 లక్షల వరకూ ఖర్చుచేసినట్లు కూడా బయటపడింది. ఇలావుండగా 2011లో ముంబైలో జరిగిన మూడు వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి యాసిన్‌ను, అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా అక్కడి మోకా కోర్టు సోమవారం బదిలీ వారంట్ జారీ చేసింది.