పాట్నా పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి
పాట్నా పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి
Published Mon, Oct 28 2013 10:26 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. మరో వందమందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్న హూంకార్ ర్యాలీ ముందు పాట్నా వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాయపడిన వారిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం ఏడు పేలుళ్లు జరగగా, గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మరో రెండు బాంబులను నిర్వీర్యం చేశారు.
కాగా పాట్నాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సభ జరిగే రోజునే, సభ సమీపంలోనే బాంబు పేలుళ్లు జరగటం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను భగ్నంచేసేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు బీహార్ సంప్రదాయం కాదన్నారు. ఇది కావాలని చేసిన పనిగా కనిపిస్తోందన్నారు. మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తగినంత భద్రత కల్పించిందని.. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని స్పష్టంచేశారు. పేలుళ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ముందస్తుగా ఎలాంటి నిఘా సమాచారం తమకు అందలేదని చెప్పారు.
Advertisement