
న్యూయార్క్: ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవ్వుర్ రాణా (64)కు మరోసారి చుక్కెదురైంది. తనను భారత్‌కు పంపొద్దంటూ అతను పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. న్యూయార్క్‌లోని భారత సంతతికి చెందిన అటార్నీ రవీ బత్రా పీటీఐకి ఈ మేరకు వెల్లడించారు.
ముంబై దాడులకు తెగబడ్డ పాకిస్తానీ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాకు సాయపడటమే గాక డెన్మార్క్‌లో ఉగ్ర దాడికి అన్నివిధాలా మద్దతిచ్చారంటూ రాణాపై అమెరికాలో దాఖలైన అభియోగాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రస్తుతం అతను లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఖైదీగా ఉన్నాడు. రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టులు ఇప్పటికే అనుమతించాయి. కోర్టు విచా రణ ఎదుర్కొనేందుకు అతన్ని త్వరలో భారత్ పంపనున్నట్టు టంప్ కూడా వెల్లడించారు.