నిఘా లోపం వల్లే ముంబై మారణహోమం
అమెరికా, బ్రిటన్, భారత ఏజెన్సీల దారుణ వైఫల్యం
న్యూయార్క్: గూఢచార చరిత్రలోనే అతి దారుణమైన వైఫల్యం వల్లే 26/11 ముంబై మారణహోమం చోటు చేసుకుందట. ఈ మారణకాండను అడ్డుకునేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా.. సద్వినియోగం చేసుకోవడంలో అమెరికా, బ్రిటన్, భారత నిఘా ఏజెన్సీలన్నీ విఫలమయ్యాయట. అత్యాధునిక నిఘా వ్యవస్థ ద్వారా కీలక సమాచారం లభించినా.. సమాచార మార్పిడిలో ఒకరికొకరు సహకరించుకోకపోవడం వల్లే భారత ఆర్థిక రాజధాని నెత్తురోడిందని పరిశోధనాత్మక నివేదిక ఒకటి తాజాగా వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్, ప్రోపబ్లికా, ద పీబీఎస్ ‘ఫ్రంట్‌లైన్’ సిరీస్‌లో భాగంగా ‘2008 ముంబై హత్యలు.. నిఘా సమాచారం వీడని చిక్కుముళ్లు’ పేరిట వివరణాత్మక నివేదికను రూపొందించింది. ఇందులో ముంబై మారణహోమానికి సంబంధించి వెలుగు చూడని వాస్తవాలను వెల్లడించింది. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై మారణహోమంలో ఆరుగురు అమెరికన్లతో పాటు 166 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మూడు దేశాల నిఘా ఏజెన్సీలు కలసి ముందుకు సాగలేదని, హైటెక్ సర్వైలెన్స్, ఇతర విభాగాల నుంచి సేకరించిన సమాచారాన్ని పంచుకోలేదని, ఇదే జరిగి ఉంటే ముంబైపై ఉగ్రదాడిని అపగలిగే వారని ఆ నివేదికలో వెల్లడించింది.
ముంబై దాడులకు సంబంధించి విలువైన డిజిటల్ డేటా ఎంతో అందుబాటులో ఉన్నా క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్ల కీలకమైన ఆధారాలు సేకరించలేకపోయారని, ఎన్‌ఎస్‌ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ బహిర్గతం చేసిన కీలక పత్రాలను ఉదహరిస్తూ పేర్కొంది. లష్కరే తోయిబా టెక్నాలజీ చీఫ్ జరార్ షాకు సంబంధించిన ఆన్‌లైన్ కార్యకలాపాలను భారత, బ్రిటన్ నిఘా సంస్థలు పర్యవేక్షించాయని, భారత వ్యాపార వేత్త ఖరాక్‌సింగ్‌గా జరార్ పేరు మార్చుకుని అమెరికన్ కంపెనీ నుంచి వాయిస్‌ఓవర్ ఫోన్ పొందినప్పటికీ సదరు సమాచారాన్ని ఇరు దేశాలు దాడులకు ముందే పంచుకోలేదని వెల్లడించింది. అలాగే పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీకి 26/11 దాడులకు ఉన్న సంబంధంపై అందిన సిగ్నల్స్(ఈ-మెయిల్స్)ను కూడా నిఘా విభాగాలు గుర్తించలేకపోయాయంది. 3 దేశాల నిఘా నివేదికల్లోనూ హెడ్లీ పేరు లేదని, అతడిని కుట్రదారుగా కూడా గుర్తించలేకపోయాయని పేర్కొంది.