బోధన్, న్యూస్‌లైన్ : బోధన్ నియోజకవర్గంలోని నవీపేట, రెంజల్, బోధన్ పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో చేరారు. బోధన్ మండలం సాలూరకు చెందిన జిల్లాస్థాయి ముఖ్యనేత పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడో, రేపో పార్టీని వీడి కాంగ్రెస్ లేదా, టీఆర్‌ఎస్‌లో చేరాలో అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు
. మండలంలో పార్టీ పటిష్టంగా ఉన్న సాలూర ఈ ముఖ్యనేత పార్టీ వీడితే పార్టీ నష్టం తీవ్రంగా ఉంటుందని కార్యకర్తలే పేర్కొంటున్నారు. పార్టీ నాయకుల మధ్య గ్రూప్ విబేధాలు ఉండటం వల్లే 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. దీంతో 15 ఏళ్లుగా తెలుగుదేశం నియోజకవర్గ ప్రాతినిథ్యానికి దూరంగా ఉంటోంది. నాయకుల మధ్య అనైక్యత కాంగ్రెస్ పార్టీ లబ్ధిని చేకూర్చుతోంది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నవీపేట మినహా బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో సైకిల్ జోరు సాగింది.
ఆవిర్భావం నుంచి ఆదరణ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బోధన్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. 1983లో పార్టీ అభ్యర్థి సాంబశివరావు చౌదరి, 1985లో బషీరుద్దీన్‌బాబుఖాన్, 1989లో కొత్త రమాకాంత్, 1994లో మళ్లీ బషీరుద్దీన్‌బాబుఖాన్ ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వరుసగా 20 ఏళ్లు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ హయాంలో, చంద్రబాబు మంత్రివర్గంలో బషీరుద్దీన్ బాబుఖాన్ క్యాబినెట్ మంత్రిగా పని చేశారు.
సీనియర్లతో పరేషాన్
క్షేత్రస్థాయి కార్యకర్తలు ఐక్యతారాగం వినిపిస్తున్నా సీనియర్లు మాత్రం ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రతినిధులుగా ఉన్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, నవీపేటకు చెందిన జిల్లా ముఖ్యనేత వి.మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్ బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆధిక్యత కోసం వీరి మ ధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు పార్టీ బలహీనపడటానికి కారణమవుతోంది.
పార్టీని వీడిన నాయకులు
రెంజల్ మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణంరెడ్డి అనుచరులతో సహా మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఎడపల్లి మండలంలోని జంలం మాజీ సర్పంచ్ మల్లిక, జైతాపూర్ సొసైటీ వైస్‌చైర్మన్ శ్రీనివాస్‌రావు తమ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
నవీపేట మండలానికి చెందిన నిజాంసాగర్ ప్రాజెక్టు డి-50 చైర్మన్ రాంరెడ్డి, సారంగపూర్ ఎన్‌సీఎఫ్‌సీ సీడీసీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, నవీపేట మాజీ ఉప సర్పంచ్ నరేందర్‌రెడ్డి, మండల పరిషత్తు కో-ఆప్షన్ సభ్యుడు ముజీబ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలో టీడీపీని వీడేవారి జాబితా ఇంకా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.