ఆపరేషన్‌ ‘ఢిల్లీ రిటర్న్‌’ | Task Force For The Identification Of Those Involved In The Delhi Nizamuddin Prayers | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ‘ఢిల్లీ రిటర్న్‌’

Published Wed, Apr 1 2020 3:42 AM | Last Updated on Wed, Apr 1 2020 11:29 AM

Task Force For The Identification Of Those Involved In The Delhi Nizamuddin Prayers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారిలో ఆరుగురు మరణించారు. అందులోనూ ఐదుగురు ఒకేరోజు మరణించడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామంది కరోనా బాధితులుండే అవకాశాలు ఉండటంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు రాత్రికి రాత్రి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో అర్ధరాత్రి విధుల్లో ఉన్న పోలీసుల్లో కొందరిని ప్రత్యేక బృందాలుగా విడిదీసి, గాలింపు తీవ్రతరం చేశారు. వైద్యారోగ్య శాఖతో కలిసి పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్‌ను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయానికే అన్ని జిల్లాల్లోని మతపెద్దలతో పోలీసులు సమావేశమయ్యారు. పరిస్థితి తీవ్రతను తెలిపి, ఎవరెవరు ఢిల్లీ వెళ్లారో తెలుసుకునేందుకు యత్నించారు. వెయ్యి మందికిపైగానే ఉంటారన్న అంచనాకు వచ్చారు.

గూగుల్‌ మ్యాప్‌ సాయంతో.. 
ఆచూకీ లభించిన వ్యక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారినీ క్వారంటైన్‌కు పంపుతున్నారు. వీరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా వారు ఢిల్లీ వెళ్లొచ్చాక ఎక్కడెక్కడ తిరిగారో వెతికే పనిలో పడ్డారు. గూగుల్‌ మ్యాప్‌లో ఉన్న ఈ సదుపాయం ఆధారంగా ఒక వ్యక్తి రోజూ ఏం చేశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? తదితర సమాచారమంతా క్లియర్‌గా మ్యాప్‌లో కనిపిస్తుంది. దీని ఆధారంగా పోలీసులు మిగిలిన వారిని అప్రమత్తం చేసే పనిలోపడ్డారు.
 
60% మంది హైదరాబాద్‌ పరిసరాల్లోనే.. 
ఢిల్లీ వెళ్లొచ్చిన వారి సంఖ్యపై మధ్యాహ్నానికి పోలీసు, ఆరోగ్య శాఖలు ఒక నిర్ధారణకు వచ్చాయి. జిల్లాల వారీగా.. వెయ్యిమందికిపైనే ఉండొచ్చని అంచనా. వీరిలో 60 శాతం మంది హైదరాబాద్‌ పరిసరాలకు చెందిన వారేనని గుర్తించారు. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రార్థనలకు హాజరై వస్తున్న 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించారని సమాచారం. తెలంగాణ నుంచి ఈ ప్రార్థనలకు హాజరైన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చనే అనుమానాలున్నాయి. వీరంతా రైలు, రోడ్డు, విమాన సర్వీసుల్లో తిరిగి వచ్చారు. పైగా అందరూ ఒకేరోజు రాలేదు. తిరుగు ప్రయాణంలో వీరి ద్వారా ఎంతమందికి సంక్రమించి ఉంటుందన్నది ఆందోళన కలిగిస్తోంది.

లక్షణాలున్న వారు ముందుకురండి.. 
విదేశాలకు లేదా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, కరోనా లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని డీజీపీ కార్యాలయం మంగళవారం మరోసారి విజ్ఞప్తి చేసింది. తబ్లిగీ జమాత్‌ కోసం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి కోసం గాలిస్తున్నామని, అటువంటి వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, తద్వారా ఎంతో మేలుచేసిన వారవుతారని తెలిపింది. నేరుగా సమాచారం అందించలేని వారు, హెల్ప్‌లైన్‌ నంబరు 104, డయల్‌ 100 లేదా సోషల్‌ మీడియా ద్వారానైనా తెలపాలని కోరింది.

‘ఢిల్లీ’అనుమానితులకు గాంధీలో వైద్యపరీక్షలు
గాంధీఆస్పత్రి: ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి నగరానికి చేరుకున్న వారికి గాంధీ ఆస్పత్రిలో మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధి, మిగతా జిల్లాల నుంచి 1,030 మంది ప్రార్థనలకు వెళ్లినట్టు గుర్తించిన వారితోపాటు వారి కుటుంబసభ్యులను పోలీసులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఓపీ విభాగంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 250 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు గల 117 మందిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగిలిన వారి వివరాలు సేకరించి హోం క్వారన్‌టైన్‌లో ఉండాలని సూచించారు.

బుధవారం మరికొందరికి పరీక్షలు నిర్వహిస్తామని డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. గాంధీ ప్రధాన ద్వారం వద్ద రహదారులను మూసివేసిన పోలీసులు బాధితులు, అనుమానితులు ఆస్పత్రి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గాంధీలో కరోనా ఐసీయూలో 65 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రధాన భవనంలోని 7, 8 అంతస్తులు బాధితులు, అనుమానితులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చిన వారికి 6వ అంతస్తు కేటాయించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది టెంట్లను వేసింది. ఉస్మానియా ఆస్పత్రి నుంచి నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు గాంధీకి డెప్యుటేషన్‌పై వచ్చారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుంచి తెచ్చిన 20 వెంటిలేటర్లతో గాంధీలో సుమారు 70 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ గైనకాలజీ విభాగాన్ని కోఠిలోని సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement