సాక్షి, సిటీబ్యూరో: పతంగుల పండుగగా పిలిచే సంక్రాంతి నేపథ్యంలో నగరంలో మాంజా విక్రయాలు జోరందుకుంటాయి. నిషేధం ఉన్నప్పటికీ లాభార్జనే ధ్యేయంగా పలువురు వ్యాపారులు గాజు రజను పూతతో కూడిన సింథటిక్ మాంజా అమ్ముతుంటారు. దీని ప్రభావాన్ని వివరిస్తూ ‘సాక్షి’ శుక్రవారం ‘డేంజర్ మాంజా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా మాంజా విక్రయాలపై నిఘా వేయాల్సిందిగా డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రసూల్‌పుర ప్రాంతంలో దాడులు చేపట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిషేధిత మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని భారీగా సరుకు స్వాధీనం చేసుకున్నారు. రసూల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్ అలీ స్థానికంగా ఏకే ట్రేడర్స్ పేరుతో డిస్పోజబుల్ సామాన్లు విక్రయిస్తుంటాడు. ఇతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజఫర్ అలీ సైతం సంక్రాంతి నేపథ్యంలో పతంగుల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేస్తారు.
ఇటీవలే వేర్వేరుగా దుకాణాలు తెరిచిన ఈ ద్వయం వివిధ రకాలైన గాలిపటాలతో పాటు మాంజాలు అమ్మడం మొదలెట్టారు. చైనా మాంజా, సింథటిక్–గాజు మిశ్రమాలతో కూడిన మాంజాలు అత్యంత ప్రమాదకరమని, వీటిపై నిషేధం ఉందని తెలిసినప్పటికీ వీరిద్దరూ ఎక్కువ లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో వాటినే అమ్ముతున్నారు. దీనిని గుర్తించిన ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.6 లక్షల విలువైన నిషేధిత మాంజా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులకు అప్పగించారు. ఇలాంటి మాంజాలతో పతంగులు ఎగురవేస్తే అవి తెగినప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. చెట్లు తదితరాలకు వేలాడుతున్న, ఎక్కడైనా పట్టుకున్న వీటిలో పక్షులు చిక్కుకుని చనిపోతాయి. అనేక సందర్భాల్లో ప్రజలూ తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సీజన్ ముగిసే వరకు ఇలాంటి విక్రయాలపై డేగకన్ను వేసి ఉంచుతామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఎవరైనా విక్రయిస్తుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment