గంజాయి విక్రేతలుగా రైతులు
అప్పుల్లో కూరుకుపోయిన ముగ్గురు రైతులు గంజాయి విక్రేతల అవతారం ఎత్తారు!
- సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి అరెస్టు
- 8 కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన ముగ్గురు రైతులు గంజాయి విక్రేతల అవతారం ఎత్తారు! ఓ ఆటో డ్రైవర్ అందించిన గంజాయిని కమీషన్ కోసం అమ్మేందుకు హైదరాబాద్‌కు వచ్చి పోలీసులకు దొరికారు. వీరి నుంచి 8 కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబా రెడ్డి సోమవారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని యనక్‌పల్లి, కృష్ణనాయక్ తండా ప్రాంతాలకు చెందిన మారుతి రాథోడ్, కర్రా నెహ్రూ, అజ్మీర సవాయ్ సింగ్‌లు రైతులు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి పటాన్‌చెరులోని గౌతమ్‌నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ మోతీరామ్‌తో పరిచయం ఏర్పడింది.
అతడి సూచనల మేరకు గంజాయిని పటాన్‌చెరు నుంచి తెచ్చి నగరంలో విక్రయించేందుకు అంగీకరించారు. ఆదివారం సాయంత్రం 8 కేజీల గంజాయితో హైదరాబాద్ వచ్చిన ఈ ముగ్గురు.. గోల్కొండ సమీపంలోని రామ్‌దేవ్‌గూడ వద్ద సంచరిస్తుండగా సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న మోతీరామ్ చిక్కితేనే ఈ గంజాయి ఎక్కడ్నుంచి వచ్చిందనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు
బాలానగర్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫతేనగర్ డివిజన్‌లోని పిట్టల బస్తీకి చెందిన కళ (32) ఇంటి వద్ద గంజాయి అమ్ముతోందన్న సమాచారం అందడంతో ఆమె ఇంటిపై దాడి చేసి 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కళను రిమాండ్‌కు తరలించారు.